Begin typing your search above and press return to search.

బొబ్బిలి రాజును ఎందుకు తెచ్చారంటే...

By:  Tupaki Desk   |   25 April 2016 4:47 AM GMT
బొబ్బిలి రాజును ఎందుకు తెచ్చారంటే...
X
వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్న చంద్రబాబు ఒక్కో జిల్లాలో ఒక్కో వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అయితే... విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులను టీడీపీలోకి చేర్చుకోవడం వెనుక మాత్రం ఇలా జిల్లా స్థాయి ప్రయోజనాలు కాకుండా చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. బొబ్బిలి రాజు సుజయకృష్ణ రంగారావును అడ్డంపెట్టుకుని జగన్ పని పట్టాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావును తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. జగన్‌ను విపక్ష నేత నుంచి తొలగించేందుకు రంగారావు అవసరం ఉందని... ఆయనతో జగన్ పై బాణం వేయిస్తారని సమాచారం. వైసీపీ చీలిక వర్గం ఏర్పడి, దానికి జ్యోతుల నెహ్రూను నేతను చేస్తారని... వైసీఎల్పీ లీడర్ గా జగన్ ప్లేసులో జ్యోతుల వస్తారని ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. అయితే... ఆ ప్రక్రియ రంగారావు ప్రారంభించడానికి రంగారావు అవసరం ఉందట.. వైసీఎల్పీ కార్యదర్శి పదవిలో ఉన్న రంగారావు వల్ల అది సాధ్యమవుతుందని చెబుతున్నారు.

మొత్తం 37మంది ఎమ్మెల్యేలు కలసి జగన్ స్థానంలో, జ్యోతుల నెహ్రును వైసీపీఎల్పీ నేతగా ఎన్నుకునేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. అయితే... రోజా వ్యవహారంలా రచ్చ కాకుండా.. నిబంధనల్లో పొరపాట్లు దొరక్లకుండా ఉండేందుకు పూర్తి సాంకేతికంగానే చేయాలనుకుంటున్నారు. జగన్ కు పొగ పెట్టడానికి అవసరమైన 37 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాక సుజయకృష్ణ రంగారావుతో కథ నడిపిస్తారట. తాము అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో వైసీపీఎల్పీ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలనంటూ ఆయన వైసీఎల్పీ కార్యదర్శి హోదాలో లేఖ రాయనున్నారు. అప్పుడు అది అధికారిక సమావేశంగా నమోదవుతుంది. ఆ తర్వాత 37మంది సంతకాలు తీసుకుని, తాము వైసీపీఎల్పీ నేతగా జ్యోతుల నెహ్రును ఎన్నుకున్నామని స్పీకర్‌ కు లేఖ రాస్తారు. తర్వాత స్పీకర్.. ఆ లేఖ మేరకు జ్యోతుల నెహ్రును విపక్ష నేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటిస్తారు. ఇదంతా ఎక్కడా తేడా రాకుండా, నిబంధనల ప్రకారం జరగాలంటే రంగారావు తప్పనిసరి. అందుకోసమే ఏరికోరి ఆయన్ను తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. అయితే... ఈలోగా జగన్ వైసీఎల్పీ కార్యదర్శిగా రంగారావు స్థానంలో వేరే ఇంకెవరినైనా నియమిస్తే ఏమవుతుందున్న ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతోంది. అప్పుడేమవుతుందో చూద్దాం.