Begin typing your search above and press return to search.

తలసానికి కట్ చేసింది అందుకేనా?

By:  Tupaki Desk   |   26 April 2016 5:26 AM GMT
తలసానికి కట్ చేసింది అందుకేనా?
X
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టటం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు కనిపించినా.. అందరి కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది మంత్రి తలసాని వ్యవహారమే. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీటీడీపీని భారీగా దెబ్బ తీసేందుకు.. మిగిలిన తమ్ముళ్లు కారు ఎక్కేందుకు వీలుగా తలసానిని తురుపుముక్కలా కేసీఆర్ వాడుకోవటం మర్చిపోకూడదు. టీటీడీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఎంత ప్రాధాన్యం ఇస్తామన్న విషయం తలసానికి మంత్రి పదవి ఇవ్వటంతోనే కేసీఆర్ చెప్పేశారు.

తలసాని ఎపిసోడ్ లో ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టనట్లుగా ఉండటం ద్వారా జంపింగ్స్ చేసే వారికి కేసీఆర్ మరింత ఉత్సాహాన్ని కలిగించిన విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి తలసానికి చూస్తున్న శాఖల్లో అత్యంత కీలకమైన వాణిజ్య శాఖను కేసీఆర్ తాను తీసేసుకోవటం ఆసక్తికరంగా మారింది. వాణిజ్యపన్నుల శాఖ అంటే చిన్న కథ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పారిశ్రామికవేత్తలంతా సదరు మంత్రితో టచ్ లో ఉంటారు. అత్యంత కీలకమైన ఈ శాఖ నుంచి తలసానిని తప్పించటంపై ఇప్పటికే ఒక వాదన జోరుగా వినిపిస్తుంది.

అదేమంటే.. వాణిజ్యపన్నుల శాఖ వార్షిక ఆదాయం రూ.30వేల కోట్లకు చేరుకుందని.. దాన్ని రూ.50వేల కోట్లకు చేరుకునేలా చేయటం కోసమే ముఖ్యమంత్రి ఆ శాఖను తాను తీసుకున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి వాణిజ్య శాఖామంత్రిగా తలసాని బాధ్యతలు నిర్వహించటం షురూ అయ్యాక ఆ శాఖ ఆదాయం పెరిగింది. అయినప్పటికీ.. వాణిజ్య శాఖను తీసేయటం గమనార్హం. ఒక శాఖను విజయవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ కోత పెట్టటం అంటే.. ఆదాయాన్ని పెంచటం కారణం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. తలసాని కుమారుడి వ్యవహారశైలి మీద తరచూ వస్తున్న వివాదాలే తాజా కోతకు కారణంగా చెబుతున్నారు. గతంలోనూ తలసాని కుమారుడి మీద ఆరోపణలు రావటం.. అవి వివాదాస్పదంగా మారటంతో పాటు.. మీడియాలోనూ ప్రముఖంగా వచ్చిన పరిస్థితి. ఇలాంటివి ఎంతమాత్రం సరికాదన్న సంకేతాన్ని తాజాగా తన చర్య ద్వారా కేసీఆర్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. తలసాని వైఖరి మీద ఆగ్రహంగా ఉన్నకేసీఆర్.. తాజా కోతతో తలసాని ఒక్కరికే కాదు.. మిగిలిన వారికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పొచ్చు. తోక జాడించే వారు ఎంతటి వారైనా.. కత్తిరించేందుకు తానే మాత్రం మొహమాట పడనన్న విషయాన్ని కేసీఆర్ తన తాజా చర్యల ద్వారా స్పష్టం చేసినట్లైంది.