Begin typing your search above and press return to search.

త‌ల‌సాని రెచ్చిపోవ‌టం వెనుక అస‌లు కార‌ణం ఇదా?

By:  Tupaki Desk   |   11 March 2019 9:14 AM GMT
త‌ల‌సాని రెచ్చిపోవ‌టం వెనుక అస‌లు కార‌ణం ఇదా?
X
ఈ రోజున టీఆర్ఎస్ లో చెల‌రేగిపోతున్న నేత‌ల్లో చాలామంది నాడు.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన వారే. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టినోళ్లే. ఎవ‌రిదాకానో ఎందుకు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సంగ‌తే తీసుకుంటే..తాను త‌లుచుకుంటే కేసీఆర్ హైద‌రాబాద్‌లో తిర‌గ‌లేరంటూ ఆగ్ర‌హంతో ఫైర్ అయిన మాట‌ల్ని మ‌ర్చిపోలేం.

అప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న తల‌సాని.. త‌న రాజ‌కీయ బాస్ బాబుకు ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలిచార‌ని చెప్పాలి. కాల‌క్ర‌మంలో బాబు పార్టీతో తెగ తెంపులు చేసుకొని కేసీఆర్ గూటికి చేరిన ఆయ‌న‌కు.. వ‌చ్చి రాగానే మంత్రి ప‌ద‌విని ఇచ్చి అక్కున చేర్చుకున్నారు కేసీఆర్‌. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి త‌న వెంట ఉన్న నేత‌ల్ని కాద‌ని మ‌రీ.. త‌ల‌సాని పార్టీలో చేరిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే మంత్రి ప‌ద‌విని ఇచ్చిన వైనం అప్ప‌ట్లో టీఆర్ ఎస్ లోని సంప్ర‌దాయ గులాబీ నేత‌ల‌కు క‌డుపు మండిపోయిన‌ట్లుగా చెబుతారు.

ఇదిలా ఉంటే.. రెండోసారి ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన నెల త‌ర్వాత మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించిన వేళ‌లోనూ త‌ల‌సానికి మంత్రి ప‌ద‌విని క‌న్ఫ‌ర్మ్ చేయ‌టం ద్వారా ఆయ‌న‌కు తానిచ్చే ప్రాధాన్య‌త ఎంత‌న్న విష‌యాన్ని కేసీఆర్ స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. కేసీఆర్ కు వీర విధేయుడిగా.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించే త‌ల‌సాని.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో త‌ర‌చూ ప‌ర్య‌టిస్తూ.. చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ ఫ్యామిలీ కాకుండా చంద్ర‌బాబును తీవ్ర‌స్థాయిలో దునుమాడుతున్న గులాబీ నేత త‌ల‌సాని మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.మిగిలిన వారంతా కామ్ గా ఉంటే.. త‌ల‌సాని మాత్రం మిగిలిన వారికి భిన్నంగా బాబుపై ఇంత తీవ్రంగా ఎందుకు విరుచుకుప‌డుతున్నారు? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది. దీనికి ఆన్స‌ర్ వెతికే క్ర‌మంలో ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తాజాగా జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ టీఆర్ ఎస్ టికెట్ ను త‌న కొడుక్కి ఆశిస్తున్నార‌ట త‌ల‌సాని. ఆయ‌న‌కు ఒక కుమారుడు.. ఇద్ద‌రు కుమార్తెలు. కుమారుడు సాయి కిర‌ణ్ యాద‌వ్ ను త‌న రాజ‌కీయ వార‌సుడిగా త‌యారు చేయాల‌న్న ఆలోచ‌న‌లో త‌ల‌సాని ఉన్న‌ట్లుగా స‌మాచారం.

మొన్న‌టి వ‌ర‌కూ తెర వెన‌క్కే ప‌రిమితం చేసిన ఆయ‌న‌.. తాజా ఎన్నిక‌ల్లో మాత్రం బ‌రిలోకి దింపాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతారు. ఎంపీ ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌ప‌టం ద్వారా నేరుగా ఢిల్లీకి పంప‌టం ద్వారా త‌న కొడుకు రాజ‌కీయ జీవితానికి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వ‌ట‌మే కాదు.. ప్యూచ‌ర్ లో పెద్ద లీడ‌ర్ గా మారేందుకు అవ‌స‌ర‌మైన గ్రౌండ్ కోసం ప్లాన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు తిరుగులేని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో సికింద్రాబాద్ లోక్ స‌భ స్థానం ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ ఎస్ కు పూర్తి ప‌ట్టు ఉంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ చేత త‌న కొడుక్కి టికెట్ ఇప్పించుకోగ‌లిగితే గెలుపు క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లేన‌న్న ఆలోచ‌న‌లో త‌ల‌సాని ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ కార‌ణంతోనే కేసీఆర్ అమితంగా మండిప‌డే బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా ఆయ‌న మ‌న‌సును దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. త‌ల‌సాని చేస్తున్న హాట్ విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న కోరుకున్న‌ట్లుగా కొడుక్కి టికెట్ ఇప్పించుకోగ‌లుగుతారా? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది.