Begin typing your search above and press return to search.

తెలుగు త‌మ్ముళ్ల అల‌క‌కు కార‌ణ‌మిదేన‌ట‌!

By:  Tupaki Desk   |   3 April 2017 5:50 AM GMT
తెలుగు త‌మ్ముళ్ల అల‌క‌కు కార‌ణ‌మిదేన‌ట‌!
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడి తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌నానికి స‌మీపంలో నిన్న సంద‌డిగా జ‌రిగిన చంద్ర‌బాబు కేబినెట్ పున‌ర్వవ‌స్థీక‌ర‌ణ... టీడీపీలో పెను తుఫానునే రేపింద‌న్న వార్త‌లు వినిపించాయి. పార్టీలో సీనియ‌ర్ నేతలుగా కొన‌సాగుతున్న ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు... కేబినెట్‌లో త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డంతో ఏకంగా త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేశారు. కొంద‌రైతే పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామాలు చేస్తామంటూ బెదిరించారు. దీంతో నిన్న తెలుగు న్యూస్ ఛానెళ్ల‌లో ఈ ముస‌లంపై పెద్ద ఎత్తున నాన్ స్టాప్‌ గా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. గంట‌కో నేత రంగంలోకి దిగుతూ... చంద్ర‌బాబుపై అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతూ చేస్తున్న వ్యాఖ్య‌లతో రాజ‌కీయం వేడెక్కినట్టేన‌న్న వాద‌న వినిపించింది.

అయితే సాయంత్రానికంతా ఈ ప‌రిస్థిలో చాలా మార్పే వ‌చ్చింది. అసంతృప్తి వ్య‌క్తం చేసిన నేత‌లంద‌రితోనూ మాట్లాడాలంటూ జారీ అయిన చంద్ర‌బాబు ఆదేశాల‌తో కొంద‌రు సీనియ‌ర్లు రంగంలోకి దిగేశారు. దీంతో ప‌రిస్థితి కాస్తంత చ‌ల్ల‌బ‌డినా... నేటి సాయంత్రానికి గాని అసంతృప్తి ఉప్పెన చ‌ల్లారేలా లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స‌హా పార్టీ ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు కూడా చెక్కు చెద‌రని మ‌న‌స్తత్వంతో ముందుకు సాగిన దూళిపాళ్ల నరేంద్ర కుమార్ వంటి నేత‌లు కూడా చంద్ర‌బాబు వైఖ‌రిపై నిప్పులు చెర‌గ‌డ‌మేమిట‌న్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేసింది.

పార్టీలో మొద‌టి నుంచి ఉన్న త‌మ‌ను కాద‌ని, నిన్న గాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన వారికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డం వెనుక... వైసీపీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డ‌మేన‌న్న పార్టీ వైఖ‌రి వారికి అసంతృప్తుల‌కు తెలియ‌నిది కాదు క‌దా. మ‌రి అసంతృప్త గ‌ళం విప్ప‌డానికి కార‌ణమేంట‌న్న కోణంలో ఆరా తీస్తే... ఆసక్తిక‌ర‌మైన వాద‌న వినిపిస్తోంది. రాష్ట్రంలో సొంత‌ పార్టీ ప్ర‌భుత్వం ఉన్నా... త‌మ‌కు ఆశించిన మేర కాంట్రాక్టులు - ఇత‌ర ప‌నులు ద‌క్క‌డం లేద‌న్న భావ‌న తెలుగు త‌మ్ముళ్ల‌లో ఎప్ప‌టి నుంచో ఉంద‌ట‌. బాబు కేబినెట్‌ లోని మంత్రులే స్వ‌యంగా రంగంలోకి దిగి... త‌మ అనుచ‌ర వ‌ర్గానికే మెజారిటీ ప‌నుల‌ను క‌ట్ట‌బెడుతూ పార్టీ ఎమ్మెల్యేల వైపు దృష్టి సారించ‌డం లేద‌ట‌.

దీంతో ఎప్ప‌టినుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగు త‌మ్ముళ్లు... త‌మ నిర‌స‌న గ‌ళాన్ని విప్పేందుకు స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే నిన్న‌టి కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ వారికి మంచి అవ‌కాశంగా క‌నిపించింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో త‌మ పేరు ఉండ‌ద‌ని తెలిసినా.. పేర్లు వెల్ల‌డ‌య్యే దాకా సైలెంట్‌ గానే ఉన్న తెలుగు త‌మ్ముళ్లు నిన్న ఒక్క‌సారిగా గ‌ళం విప్పారు. ఆ త‌ర్వాత ఎలాగూ త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే నేత‌ల వ‌ద్ద త‌మ మ‌న‌సులోని తాయిలాల మాట‌ను బ‌యట‌పెట్టేసిన అసంతృప్తులంతా... ఆ తాయిలాలకు సానుకూల స్పంద‌న రావ‌డంతో ఆ త‌ర్వాత మెత్త‌బ‌డ్డార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/