Begin typing your search above and press return to search.

భారత జట్టు విజయరహస్యం ఇదే..

By:  Tupaki Desk   |   19 Jun 2019 4:15 AM GMT
భారత జట్టు విజయరహస్యం ఇదే..
X
ఈ ప్రపంచకప్ లో అత్యంత బలమైన జట్లుగా పైకి కనిపిస్తున్న వెస్టిండీస్ జట్టు ఎందుకు ఓడిపోతోంది. పసికూనగా కనిపించిన బంగ్లాదేశ్ ఎందుకంత చెలరేగిపోతుంది. ఇక ఇండియన్స్ అంత సమష్టిగా ఎలా పాకిస్తాన్ ను చిత్తు చేశారు. ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. అయితే టీమిండియా ఈ సమష్టి విజయాల వెనుక పెద్ద ప్రణాళికతో ముందుకు సాగడమే కారణం.

వెస్టిండీస్ ఒక దేశం కాదు.. కొన్ని దేశాల సమహారం. ఒక్కో దేశం నుంచి ఒక్కొక్కరు రావడంతో వారు కలిసిపోలేక.. సమైక్యంగా ఆడలేక.. సఖ్యతతో మెలగలేక ఓడిపోతున్నారు. గేల్ - రస్సెల్ - హిట్ మెయిల్ - బ్రాత్ వెయిట్ లాంటి భీకర ఆటగాళ్లున్నా.. వారంతా ఎవరికి వారే యుమునాతీరే లాగా ఆడడంతో ఓడిపోతున్నారు. ఇక చిన్న జట్టు బంగ్లాదేశ్ ఆటగాళ్లు దేశం కోసం అంతా కుర్రాళ్లు కలిసికట్టుగా ఆడుతూ విజయం సాధిస్తున్నారు. అందరూ ఒక జట్టుగా ఆడడమే బంగ్లా విజయరహస్యం.

భారత దేశం పెద్దది.. 130 కోట్ల జనాభా.. వివిధభాషలు - రాష్ట్రాల నుంచి ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడుతుంటారు. వారు అందరూ కలిసిపోవడమే టీమిండియా విజయరహస్యం. అయితే జూనియర్ అయిన విజయ్ శంకర్ లాంటి వాళ్లు సీనియర్ అయిన ధోనితో కలవడానికి వీలుగా టీమ్ మేనేజ్ మెంట్ సరికొత్త ప్రణాళికలు రచిస్తుందట..

భారత ఆటగాళ్లు మధ్య అరమరికలు లేకుండా కలిసిపోవడానికి వారిని మూడు గ్రూపులుగా విభజించి సరదాగా ఆడే ఆటలు - యాక్టివిటీస్ ను చేయిస్తారట.. ప్రపంచకప్ లాంటి భారీ సమరంలో ఇలాంటివి జట్టు ఆటగాళ్ల మధ్య సఖ్యత - సాన్నిహిత్యం - కలిసిపోయి సమష్టిగా ఆడే తత్వాన్ని నేర్పిస్తాయట..

టీమిండియాలో కోహ్లీ - రోహిత్ - ధోనిలను టీం లీడర్లుగా పెట్టి నలుగురిని ఒక గ్రూపుగా వీరికి కేటాయించి వారితో సరదా ఆటలు.. కలిసి బోజనాలు చేయించడం లాంటివి టీమిండియా మేనేజ్ మెంట్ చేయిస్తోంది. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ విజయం తర్వాత రెండు రోజుల సెలవులు ఇచ్చిన టీం ఆటగాళ్లను కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కూడా ఇచ్చింది. ఇలా సమష్టితత్త్వంతోపాటు ఆటగాళ్లు ఉత్సాహంగా కలిసిపోవడానికి టీమిండియా చేస్తున్న ప్రణాళికలు భారత జట్టు విజయానికి కారణమవుతున్నాయి.