Begin typing your search above and press return to search.

టీజీ కొడుకు పార్టీ ఎందుకు జంప్ కాలేదంటే?

By:  Tupaki Desk   |   22 Jun 2019 5:48 AM GMT
టీజీ కొడుకు పార్టీ ఎందుకు జంప్ కాలేదంటే?
X
నీరు ప‌ల్ల‌మెరుగు.. టీజీ అధికార‌ పార్టీ మెరుగు అన్న‌ట్లుగా క‌ర్నూలు జిల్లాలో జోకులు వేసుకుంటారు. అధికారంలో ఎవ‌రున్నా స‌రే.. వారితో దోస్తీ చేసే స‌త్తా ఆయ‌న సొంతం. అంతేనా.. ప‌వ‌ర్ లెస్ నుంచి ప‌వ‌ర్ ఫుల్ గా మార‌ట‌మే కాదు.. కీల‌క‌మైన ప‌ద‌వులు పొంద‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి..ఏకంగా రాజ్య‌స‌భ సీటును చేజిక్కించుకోవ‌టం.. అందునా బాబును ఒప్పించ‌ట‌మంటే మాట‌లా?

అలాంటి క‌ష్ట‌మైన‌.. క్లిష్ట‌మైన ప‌నుల్ని సింఫుల్ గా చేసే స‌త్తా టీజీ సారు సొంతం. త‌న‌కు మాత్ర‌మే కాదు త‌న కొడుక్కి టికెట్ ఇప్పించుకునేలా చేయ‌టంలోనూ అంతే ప‌ట్టుద‌ల‌గా వ్య‌వ‌హ‌రించినా.. ప్ర‌జ‌లు మాత్రం ఎన్నిక‌ల్లో ఓట‌మిని ఇచ్చి త‌మ తీర్పు చెప్పేశారు.

తాజాగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన టీజీ వారి వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కొడుకు జంప్ కాకుండా.. టీడీపీలోనే ఉండిపోవ‌టం ఒక ఎత్తు.. ఆ విష‌యాన్ని మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చేలా హైలెట్ చేసుకోవ‌టం మ‌రో ఎత్తు.

త‌న తండ్రి పార్టీ మారిన వెంట‌నే తాను లోకేశ్ కు ఫోన్ చేసి.. తాను పార్టీ మార‌టం లేద‌ని.. త‌న తండ్రితో త‌న‌కు సంబంధం లేద‌న్న అర్థం వ‌చ్చేలా మీడియాకు చెప్పారు. త‌న తండ్రి రాజ‌కీయం త‌న‌ది వేర్వేరుగా ఉంటుంద‌న్న భావ‌న క‌లిగేలా వ్య‌వ‌హ‌రించిన టీజీ భ‌ర‌త్ మాట‌ల్లో నిజం ఎంత‌? తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమ‌తోనే ఆయ‌న‌లా వ్య‌వ‌హ‌రించారా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూస్తాయి.

రాజ‌కీయాల్లో ప్రేమాభిమానాల కంటే కూడా ప‌వ‌ర్ చుట్టూనే న‌డుస్తుంది. మ‌రి.. అలాంట‌ప్పుడు తండ్రితోపాటు బీజేపీలోకి వెళితే.. స‌రిపోయేదిగా అనుకోవ‌చ్చు. కానీ.. టీజీ భ‌ర‌త్ అంత పిచ్చోడేమీ కాదు. త‌న తండ్రి ఎప్పుడైనా.. ఎక్క‌డైనా.. ఏ పార్టీలో నుంచైనా జంప్ అయ్యే శ‌క్తిసామ‌ర్థ్యాలు పుష్క‌లం. తాను అలా కాదు. త‌న‌కు ఇంకా చాలా కెరీర్ ఉంది. అందులోకి తాను ప్రాతినిధ్యం వ‌హించేది క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి. అలాంటివేళ‌.. చూస్తూ.. చూస్తూ బీజేపీలో చేరితే ఆత్మ‌హ‌త్యాసాదృశ్య‌కం అవుతుంది.

ఎందుకంటే.. క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రైనా గెలిచారంటే వారికి ముస్లింల మ‌ద్ద‌తు పెద్ద ఎత్తున అవ‌స‌రం. అలాంటివేళ టీజీ భ‌ర‌త్ లాంటోడు బీజేపీలో చేరితే.. శాశ్వితంగా భ‌ర‌త్ కు మైనార్టీలు దూర‌మ‌య్యే అవ‌కావః ఉంటుంది. అందుకే.. తండ్రి త‌న దారి తాను చూసుకున్నా.. కొడుకు మాత్రం టీడీపీ ప‌ట్ల విప‌రీత‌మైన ప్రేమాభిమానాలు ఉన్న‌ట్లుగా పేర్కొంటూ ఉండిపోయారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం లేకుండా టీజీ ఫ్యామిలీ ఏప‌నైనా చేస్తుందా? అన్న అనుమానం.. తాజా కార‌ణాల్ని చూసిన‌ప్పుడు టీజీ భ‌ర‌త్ నిర్ణ‌యం వెనుక అస‌లు విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు. వామ్మో.. టీజీ ఫ్యామిలీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!