Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని నంద్యాల అంటూ టీజీ ప్రకటన వెనుక మర్మం ఇదే!

By:  Tupaki Desk   |   27 Aug 2019 5:02 AM GMT
ఏపీ రాజధాని నంద్యాల అంటూ టీజీ ప్రకటన వెనుక మర్మం ఇదే!
X
ఏపీ రాజధానిపై ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడున్న అమరావతికి వరదపోటు ఉందన్న మంత్రి బొత్స వ్యాఖ్యల నేపథ్యంలో.. కొత్త రాజధానికి సంబంధించి ఎవరికి తోచిన ప్రకటన వారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీకి రాజధాని ఒకటి కాదు నాలుగు అంటూ సంచలనంగా మారారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్.
ఏపీలోని నాలుగు ప్రాంతాల్ని ఏపీ రాజధానులుగా జగన్ ప్రకటించటం ఖాయమని టీజీ చెప్పటం.. ఇదే విషయాన్ని బీజేపీ అధినాయకత్వానికి జగన్ ఇప్పటికే స్పష్టం చేసిన సమాచారం కూడా తన దగ్గర ఉన్నట్లుగా ఆయన చెప్పారు. ఏపీకి నాలుగు రాజధానులు అంటూ సంచలన ప్రకటన చేసిన టీజీ తాజాగా.. రాజధానిగా కర్నూలు కంటే నంద్యాలను చేయాలని పేర్కొనటం విశేషం.

తాజాగా ఎమ్మిగనూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన నోటి నుంచి కొత్త డిమాండ్ వచ్చింది. తాను నివాసం ఉండే కర్నూలు కాకుండా.. నంద్యాలను రాజధాని నగరంగా ప్రకటించాలని టీజీ ఎందుకు కోరినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చేశాయి. రాజ్యసభ సభ్యుడు కమ్ పారిశ్రామికవేత్త అయిన టీజీ వెంకటేశ్ నివాసం ఉండేది.. ఆయన ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైనవి కర్నూలు నగరం చుట్టుపక్కలే ఉన్నాయి.

అయితే.. టీజీ వెంకటేశ్ మూలాలు మొత్తం నంద్యాలలోనే ఉన్నాయి. నంద్యాల ప్రాంతానికి చెందిన టీజీ.. వ్యాపార కార్యకలాపాల కోసం కర్నూలుకు వచ్చి అక్కడ స్థిరపడ్డారు. సొంత గడ్డ మీద అభిమానాన్ని ప్రదర్శిస్తూ.. తమ సొంతూరైన నంద్యాలను రాజధాని నగరంగా చేసుకోవాలన్న ఆసక్తిని ప్రదర్శించటం కనిపిస్తుంది. నంద్యాలను రాజధాని నగరంగా ప్రకటించటం ద్వారా.. కొత్త చర్చకు కారణం కావటమే కాదు..నంద్యాల వాసుల మనసుల్ని దోచుకునే అవకాశాన్ని టీజీ మిస్ చేసుకోకూడదన్నట్లుగా ఆయన వ్యూహం ఉందని చెప్పక తప్పదు.