Begin typing your search above and press return to search.

బెజ‌వాడ మెట్రో లైను మార్పు వెనుక లాబీయింగ్‌

By:  Tupaki Desk   |   28 Nov 2015 5:30 PM GMT
బెజ‌వాడ మెట్రో లైను మార్పు వెనుక లాబీయింగ్‌
X
బెజ‌వాడ మెట్రో వివాదంలో చిక్కుకుంది. పెద్ద‌ల భూములు వ‌దిలేసి పేద‌ల భూములు లాక్కునేందుకు ఉత్త‌ర్వులు విడుద‌ల‌వ‌డమే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. తద్వారా మెట్రో మార్గం ట్రాక్ తప్పుతోందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పెద్దలను వదిలేసి....పేదల ఆస్తులకు ఎసరుపెడుతున్నారని రైతులు రోడెక్కారు. తమ భూములు పోతున్నాయని, పెద్ద‌లు కోసం త‌మ భూములు బ‌లి చేస్తున్నార‌నే వారు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

వివాదం ఎలా మొద‌లైదంటే.. అమ‌రావ‌తి రాజ‌ధాని అవ్వడంతో రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత విజ‌య‌వాడ‌లో భూముల రేట్లు చుక్క‌ల‌నంటుతున్నాయి. అలాగే విజ‌య‌వాలో ఏలూరు రోడ్డులో గ‌జం రేటు ల‌క్ష‌ల్లోనే ఉంది. విజయవాడకు చెందిన పలువురు బడాబాబులకు విజయవాడ-ఏలూరు రోడ్డులో భూములున్నాయి. అందులో ఇప్పటికే భారీ ఎత్తున నిర్మాణాలు - షాపింగ్‌ కాంప్లెక్సులు నిర్మించేశారు. మెట్రో రైల్‌ ఎలైన్‌ మెంట్‌ సర్వేలో ఈ భూములు కూడా ఉన్నాయి. మెట్రో వస్తే...ఈ భూములన్నీ ప్రాజెక్టుకింది వెళ్లిపోతాయని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఉన్నట్టుండి మెట్రో ట్రాక్ మారింది. లైన్ మార్చాక మెట్రో స్టేషన్ నిడమానూరులో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది.

ఈ మేరకు డ్రాఫ్ట్ డిజైన్ ఇచ్చి ఆ గ్రామంలో 87 ఎకరాలు సేకరించేందుకు ఉత్తర్వులు కూడా విడుద‌లైపోయాయి. అయితే ఈ ఉత్త‌ర్వుల‌పై రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. అయితే ఈ ఉత్త‌ర్వులు విడుద‌ల‌వ్వ‌డం వెనుక భారీ లాబీయింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరుకు చెందిన ఓ అధికార పార్టీ ప్రముఖుడి లాబీయింగ్ తోనే, మెట్రో రైల్‌ రూటు మారిందని స్థానిక‌ రైతులు ఆరోపిస్తున్నారు. ప‌రిస్థితి అదుపు తప్పేలా క‌నిపిస్తుండ‌డంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రంగంలోకి దిగారు. విషయాన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్తానని మాటివ్వ‌డంతో.. పరిస్థితి కొంత స‌ద్దుమ‌ణిగింది. ఇక సీఎం చంద్ర‌బాబు మాత్ర‌మే త‌మ‌ను ర‌క్షించాల‌ని రైతులు కోరుతున్నారు.