Begin typing your search above and press return to search.

బాబుకు ధీటుగా జ‌గ‌న్‌!... కార‌ణాలేంటి!

By:  Tupaki Desk   |   10 March 2019 10:52 AM GMT
బాబుకు ధీటుగా జ‌గ‌న్‌!... కార‌ణాలేంటి!
X
వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఏపీకి కాబోయే సీఎంగా దాదాపుగా అన్ని స‌ర్వేలు తేల్చి చెబుతున్నాయి. కేవ‌లం నాలుగు ప‌దుల వ‌యసులో ఉన్న జ‌గ‌న్... ఓ ప‌దేళ్లు నిండ‌ని పార్టీకి అధినేత‌గా ఉంటూ... ఏకంగా ఏపీలో అధికారం చేజిక్కించుకునేంత‌గా ఎలా ఎదిగార‌న్న విష‌యం నిజంగానే ఆస‌క్తిక‌ర‌మే. అందులోనూ 40ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్యూహాల‌ను త‌ట్టుకుని జ‌గ‌న్ నిల‌బ‌డ‌గ‌లుతున్నారన్న విష‌యం కూడా మరింత‌ ఆస‌క్తిక‌ర‌మే. ప్ర‌త్యర్థి పార్టీల‌ను దెబ్బ కొట్ట‌డంలోనే కాకుండా... పోల్ మేనేజ్ మెంట్ లో త‌న‌కు సాటి రాగ‌ల నేత‌లెవ్వ‌రూ ద‌రిదాపుల్లోకి కూడా రాలేనంత‌గా ఎదిగిన చంద్ర‌బాబుకే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న జ‌గ‌న్ తీరు ముమ్మాటికీ అమితాస‌క్తి కలిగించేదే. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తండ్రి మ‌ర‌ణంతో ఆ పార్టీతో పొస‌గ‌క వేరు కుంప‌టి పెట్టుకున్న జ‌గ‌న్‌... వైసీపీని స్థాపించారు. ఇది జ‌రిగి నిండా ప‌దేళ్లు కూడా కాకుండానే చంద్ర‌బాబునే ఢీకొట్ట‌గ‌లిగేంత‌గా జ‌గ‌న్ ఎదిగారు.

ఈ త‌ర‌హా జ‌గ‌న్ ఎదుగుద‌ల‌కు చాలా అంశాలే దోహ‌దం చేశాయ‌ని చెప్పాలి. ఇందులో ప్ర‌ధానంగా దోహ‌దం చేసిన అంశం కాంగ్రెస్‌ కు ప్ర‌త్యామ్నాయంగా జ‌గ‌న్ ఎద‌గ‌డమే. వైఎస్ బ‌తికున్నంత కాలం టీడీపీకి ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్సే. అయితే వైఎస్ అకాల మ‌ర‌ణంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింద‌నే చెప్పాలి. వైఎస్ వెంట న‌డిచిన కాంగ్రెస్ శ్రేణులంతా జ‌గ‌న్ వైపున‌కే మళ్లాయి. కొంత‌మంది నేత‌లు మిన‌హా మెజారిటీ నేత‌లతో పాటు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల బ‌ల‌మంతా వైసీపీవేపే మళ్లింది. దీనికి నిద‌ర్శ‌నంగానే... 2012లో 18 అసెంబ్లీ స్థానాలు, ఓ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌రిగితే... ఎంపీ సీటుతో పాటు 18 స్థానాల్లో ఏకంగా 15 స్థానాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ కొల్ల‌గొట్టిన సీట్ల‌లో 13 సీట్లు కాంగ్రెస్‌కు చెందిన‌వే. ఇక రెండో అంశానికి వ‌స్తే... వైఎస్ వార‌స‌త్వం. ఉమ్మ‌డి రాష్ట్రంలో తిరుగులేని నేత‌గా ఎదిగిన దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడిగా వైఎస్ జ‌గ‌న్ కూ రాష్ట్రంలోని బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం రెడ్డి సామాజిక వ‌ర్గం అండ‌గా నిలిచింది. అదే స‌మ‌యంలో క్రిస్టియ‌న్‌ గా రాష్ట్రంలోని మెజారిటీ క్రిస్టియ‌న్లు జ‌గ‌న్ వైపే నిల‌బ‌డ్డారు. ఎస్సీల్లో బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న మాల‌లు కూడా వైఎస్‌ తో న‌డిచిన‌ట్టుగానే ఇప్పుడు జ‌గ‌న్ వెంట న‌డుస్తున్నారు. అప్ప‌టికే వైఎస్ వైపు మొగ్గిన మైనారిటీ, ఎస్సీ సామాజిక వర్గాలు కూడా ఇప్పుడు పూర్తిగా జ‌గ‌న్ బాట‌న‌నే న‌డుస్తున్నాయి.

ఇక మూడో అంశం విష‌యానికి వ‌స్తే... నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అధికారం చేజిక్క‌డానికి పాద‌యాత్ర ఎలా ఉప‌యోగ‌ప‌డిందో.... దాని త‌ర‌హాలోనే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట జ‌గ‌న్ చేప‌ట్టిన సుదీర్ఘ పాద‌యాత్ర వైసీపీకి మోర్ ప్ల‌స్‌గా మారింది. 3,600 కిలో మీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌... రాష్ట్రంలోని అన్ని సామాజిక వ‌ర్గాల‌నూ క‌లుసుకున్నారు. వారిలో భ‌రోసా నింపారు. ఇక నాలుగో అంశం విష‌యానికి వ‌స్తే... 13 జిల్లాలుగా ఏర్ప‌డిన ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారు కొన‌సాగించిన పాల‌న‌ను ఎక్క‌డిక‌క్క‌డ తూర్పార‌బ‌ట్టిన జ‌గ‌న్‌... ప్ర‌జ‌ల్లో టీడీపీ ప‌ట్ల ఉన్న సానుకూల‌ను భారీగా దెబ్బ కొట్టేశారు. ఈ అన్ని కార‌ణాల‌తో జ‌గ‌న్‌... చంద్ర‌బాబుకు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగానే కాకుండా ఏకంగా చంద్ర‌బాబును గ‌ద్దె దింపే స్థాయికి చేరుకున్నార‌ని చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ ఒక్క పార్టీతో సంబంధం లేకుండానే... జ‌గ‌న్ క్లిస్ట‌ర్ క్లియ‌ర్ మెజారిటీతో వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మేన‌ని అన్ని స‌ర్వేలు చెబుతున్నాయి.