Begin typing your search above and press return to search.

వైకాపా ఎమ్మెల్యేలు అందుకోసం వెళ్తున్నారా?

By:  Tupaki Desk   |   14 April 2016 5:30 PM GMT
వైకాపా ఎమ్మెల్యేలు అందుకోసం వెళ్తున్నారా?
X
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఇంత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి క్యూ కడుతూ ఉండడం వెనుక మర్మం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క కారణం ఉండొచ్చు. అయితే యూనివర్సల్‌ గా ఎక్కువ మందికి మ్యాచ్‌ అయ్యే ఆసక్తికరమైన కారణం ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే.. వైకాపా తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన అనేక మంది నాయకులు ప్రస్తుతం భారీస్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండడం.

ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ ఈ కారణం నిజం. ఇందకు చాలా లాజికల్‌ కారణాలు ఉన్నాయి. వైఎస్సార్‌ మరణించిన తర్వాత వైకాపా ప్రభుత్వం లోకి తప్పకుండా వస్తుందనే నమ్మకంతో జగన్‌ కోసం అనేక మంది నాయకులు తొలినుంచి ఖర్చు పెడుతూనే వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో జనాన్ని తమకు అలవాటు చేసుకోవడానికి చిన్న చిన్న పనులకు విరాళాలు ఇవ్వడం, అడిగిన వారికి లేదనకుండా భారీ మొత్తాలు ఇస్తూ పోవడం ఇలా పెద్దఎత్తున నిధులు ఖర్చు చేశారు. జగన్‌ బర్త్‌ డే - వైఎస్సార్‌ జయంతి వంటివి వచ్చిన రోజుల్లో ప్రతినియోజకవర్గాల్లో హోరెత్తించారంటే ఆశ్చర్యం కాదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊర్లలో గుడులు కట్టడం - చిన్న చిన్న పనులు జరుగుతూ ఉంటే ప్రతిదానికీ భారీగా విరాళాలిస్తూ ఖర్చు పెడుతూ పోయారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం వస్తుందనుకుంటే.. ఆ కల నెరవేరలేదు. భారీ ఖర్చులకు తమ వద్ద ఉన్న సొమ్ము పోగా, చాలా మంది అప్పులు చేసి మరీ అధికారం మీది ఆశతో వెచ్చించారు. ఇప్పుడు అప్పులు మీద పడ్డాయి. పార్టీ ప్రభుత్వంలోకి రాలేదు. కనీసం అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి తగ్గించుకోవడానికి... అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. ఏదో నాలుగు పనులు చేయించుకుని కాసిని డబ్బులు ఆర్జించినా.. అప్పులనుంచి గట్టున పడవచ్చుననేది వారి ఆలోచనగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఈ అప్పుల బాధలున్నది కేవలం వైకాపాకు మాత్రమే కాదు. తెలుగుదేశంలో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అప్పుల ఊబిలో కూరుకునే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గనుక.. వారికి అప్పులిచ్చిన వారు కూడా పెద్దగా ఒత్తిడి చేయడం లేదు. వారు కాస్త సేఫ్‌ జోన్‌ లోనే ఉన్నట్లు లెక్క. వైకాపా వారు మాత్రం ఈ ఒత్తిడులు తప్పించుకోవడానికే వెళుతున్నారనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ.