Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లోకి ఆంధ్రా నేతలు.. అసలు రహస్యం అదే

By:  Tupaki Desk   |   2 Jan 2023 4:40 AM GMT
బీఆర్ఎస్ లోకి ఆంధ్రా నేతలు.. అసలు రహస్యం అదే
X
మొన్నటి వకు ఉప్పు నిప్పు.. ఇప్పుడు పప్పు బెల్లం.. అన్న రీతిలో ఉంది కేసీఆర్ తీరు. ఆంధ్రపాలకులతోనే తెలంగాణ కు అన్యాయం జరిగిందని.. వారిని ఇక్కడి నుంచి వెళ్లగొడితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ప్రాణం పోయే వరకు పోరాడారు. తన గుండెలపై ‘తెలంగాణ’ ముద్ర వేసుకొని ప్రజలను చైతన్యవంతులను చేశారు. కానీ అప్పటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు.. వద్దన్న ఆంధ్రా నాయకులతోనే కేసీఆర్ సోపతి చేస్తున్నారు. నాడు తనను తిట్ల దండకంతో ఆడిపోసుకున్నవారినే ఇప్పుడు తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ అక్కడి నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. కొందరు ఇప్పటికే చాటు మాటున పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సోమవారం మరికొంతమంది అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే బీఆర్ఎస్ లో చేరేవాళ్లూ.. టైంపాస్ కు కండువా కప్పుకోవడం లేదు. వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. వారికి చేరిక వెనుక అసలు కారణం ఏంటంటే..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆంధ్రా రాజకీయ నాయకులంతా హైదరాబాద్ లోనే ఉండేవాళ్లు. ఈ క్రమంలో చాలా మంది తమ ఆస్తులను కూడబెట్టుకున్నారు. తెలంగాణ పోరాటంలో కొంత మంది తమ ఆస్తులను విక్రయించి సొంత ప్రదేశానికి వెళ్లగా.. చాలా మంది అలాగే ఉంచుకున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఇలాంటి వారు టీఆర్ఎస్ ను విమర్శించడానికి భయపడేవారు. కేసీఆర్ ను విమర్శిస్తే తమ ఆస్తులకు ఎక్కడ ఎసరు పెడుతారోనని ఆందోళన చెందారు. అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చే సమయంలో సెటిలర్లు ఎలాంటి అభ్యంతరం లేకుండా హాయిగా జీవించొచ్చు.. అని కేసీఆర్ వారిని ఆదరించారు. దీంతో తెలంగాణలో ఆస్తులున్న నాయకులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించి ఆంధ్రలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కొత్త రాజకీయ పార్టీ వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ తో మాత్రం చాలా మంది ఆంధ్రా నాయకులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. తెలంగాణలోని తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సోమవారం మరికొంత మంది ప్రగతి భవన్ కు వచ్చి గులాబీ కండువా కప్పుకోనున్నారు.

బీఆర్ఎస్ లో సోమవారం చేరేవారిలో తోట చంద్ర శేఖర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన ఇప్పటి వరకు జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ఐఏఎస్ అధికారి అయినా ఈయనకు కేసీఆర్ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజికి వర్గానికి చెందిన ఆయనను అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఏపీలోని ఆ వర్గం ఓట్లను ప్రభావితం చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

ఈయనతో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారధి పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ ను ఆంధ్రలో విస్తరించేందుకు ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. అయితే నిన్నా మొన్నటి వరకు ఆంధ్రాపై విద్వేషాలు రగిల్చిన కేసీఆర్ ఇప్పుడు అక్కడి నాయకులతో రాజకీయం చేయడం వెనుక రెండు కారణాలను విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఒకటి హైదరాబాద్ లోని తమ ఆస్తుల రక్షణకు కేసీఆర్ పంచన చేరడం.. రెండోది బీఆర్ఎస్ లో చేరేవారంతా కాపు నాయకులే.. అందరినీ బీఆర్ఎస్ లో చేర్చుకొని జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీని దెబ్బకొట్టి తన రహస్యమిత్రుడు జగన్ కు మేలు చేయడం.. ఇలా రెండు కారణాలతోనే ఏపీలోని కాపు నేతలను కేసీఆర్ లాగుతున్నారని.. కేసీఆర్ ప్లాన్ వెనుక జగన్ ఉన్నారని అంటున్నారు. ఇది కేసీఆర్ కు మాత్రమే తెలిసిన విద్య అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.