Begin typing your search above and press return to search.

ముద్రగడకు ఇష్యూలో కాపు విపక్ష నేతల గేమ్ ప్లాన్?

By:  Tupaki Desk   |   14 Jun 2016 4:55 AM GMT
ముద్రగడకు ఇష్యూలో కాపు విపక్ష నేతల గేమ్ ప్లాన్?
X
కాపు నేతలంతా ఒక్కటయ్యారు. కాపుల సంక్షేమం కోసమే తామున్నట్లుగా మాట్లాడుతున్న వీరంతా ఏపీ విపక్ష నేతలే కావటం గమనార్హం. కాపుల ప్రయోజనాల కోసం ముద్రగడ చేస్తున్న దీక్షకు తాము మద్దతు పలుకుతున్నట్లు చెబుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఒంటరి వాడు కాదని.. తామంతా ఆయనకు అండగా ఉన్నట్లుగా చెబుతున్నారు. విభజన కారణంగా సమాధి అయిన కాంగ్రెస్ కు చెందిన కాపు నేతలు.. ఏపీ అధికారపక్షాన్ని రాజకీయంగా దెబ్బ తీయాలన్న ఆలోచనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలంతా ఒక్కటై.. ఏపీ అధికారపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవటం కనిపిస్తుంది.

నిన్నమొన్నటివరకూ రాజకీయాల్లో పెద్దగా కనిపించని చిరంజీవి సైతం తాజా ఎపిసోడ్ లో మాత్రం చురుగ్గా కనిపించటం గమనార్హం. విభజనతో ఏపీ ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తింటున్నా నోట మాట రాని నేతలు.. కాపుల ప్రయోజనాలంటూ గొంతు పెంచుతున్న వైనం చూస్తే.. ఇప్పుడిన్ని మాటలు మాట్లాడుతున్న వారు.. విభజన సందర్భంగా ఏపీ ప్రజల ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తింటున్నా ఎందుకు స్పందించలేదు?

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాపుల్ని బీసీల్లోకి చేరుస్తామంటూ హామీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. టీడీపీ హామీ ఇచ్చిన తర్వాత కూడా.. మిగిలిన ఏ రాజకీయ పార్టీ కూడా కాపుల గురించి.. వారికి తాము చేయబోయే ఉపకారం గురించి మాట్లాడింది లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ముద్రగడ సీన్లోకి వచ్చినప్పుడు కూడా స్పందించని వారు.. తుని ఘటన తర్వాత నుంచి కాస్త యాక్టివ్ గా ఉండటం గమనార్హం.

అంటే.. కాపుల ప్రయోజనాల కంటే కూడా.. కాపుల ఇష్యూతో భావోద్వేగాల్ని రాజేసి.. ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పడేయటంతో పాటు.. తమ పరపతిని పెంచుకోవటం.. విభజన శాపం నుంచి విముక్తి కావటమే లక్ష్యమన్నట్లుగా వారి తీరు ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. లేకుంటే.. ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి బజార్లోకి వచ్చి మాట్లాడని దాసరి నారాయణ రావు.. ఇప్పుడు ముద్రగడ ఒంటరి వాడు కాదని.. ఆయన వెనుక తామంతా ఉన్నామంటూ పూనకం వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నట్లు?

తన 150 సినిమానే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ.. రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉంటున్న చిరంజీవి.. ఏపీ ప్రత్యేక హోదా మొదలు ఏ విషయాన్ని పట్టించుకోని ఆయన.. ముద్రగడ ఇష్యూలో చంద్రబాబు సర్కారుపై ఇంతగా చెలరేగిపోవటం ఏమిటి? ఇదే విధంగా పళ్లం రాజు కావచ్చు.. బొత్స సత్యనారాయణ కావొచ్చు.. చాలామంది నేతలు ఇప్పుడు ఒక్కసారిగా తెర మీదకు వచ్చేశారు. ఇదంతా కూడా ముద్రగడ మీద అభిమానం కంటే కూడా.. ముద్రగడ రాజేసిన కాపుల భావోద్వేగాల్ని వీలైనంతవరకూ తమ ఖాతాలోకి మళ్లించుకోవటమే లక్ష్యంగా కనిపిస్తుంది. తమ రాజకీయ ప్రయోజనాలు తప్పించి.. కాపుల మీద ప్రేమాభిమానాలు లేని కాపు నేతల మీద కాపులు నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనిపై ఏపీ కాపులు ఎలా రియాక్ట్ అవుతారన్నది పెద్ద ప్రశ్న అనే చెప్పాలి.