Begin typing your search above and press return to search.

తల్లీ.. గోదారి; అంత ఘోరం ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   15 July 2015 4:54 AM GMT
తల్లీ.. గోదారి; అంత ఘోరం ఎందుకంటే..?
X
గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు రాజమండ్రిలో చోటు చేసుకున్న తీవ్ర తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎక్కడ లోపం? ఇంత భారీగా మృతులు ఉండటానికి కారణం ఏమిటి? అన్న అంశాలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే...

మొదటి తప్పు..

తొక్కిసలాట జరిగిన పుష్కర ఘాట్ లోనే ఇంత భారీ దుర్ఘటన చోటు చేసుకోవటానికి కారణాలు చూస్తే.. ఈ రేవు ఎదురుగా గోదావరి రైల్వే స్టేషన్ ఉంటుంది. పుష్కరాల నేపథ్యంలో అన్ని రైళ్లు ఇక్కడ ఆగే ఏర్పాటు చేశారు. రైలు ఆగిన ప్రాంతంలో సహజంగానే రద్దీ ఎక్కువ. దీనికి తోడు.. సౌకర్యాలు కూడా ఎక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు.

మంగళవారం ఉదయం పుష్కరాల ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి రైల్వే స్టేషన్ తో పాటు.. రోడ్డు మార్గం నుంచి భారీగా భక్తులు చేరుకున్నారు. దీంతో.. రోడ్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఇంత భారీగా జనం ఒకే చోట సమీకరించటం చూసినప్పుడే అధికారులు ప్రమాదాన్ని ఊహించి.. భక్తుల్ని మిగిలిన ఘాట్లకు వెళ్లాలని కోరితే ప్రమాద తీవ్రత చాలావరకూ తగ్గేది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు.

రెండో తప్పు..

తొక్కిసలాట జరిగిన రేవుకు మూడు ద్వారాలు ఉన్నాయి. ఇంత భారీగా ప్రజలు వచ్చే సమయంలో.. ప్రవేశానికి ఒక ద్వారాన్ని.. బయటకు వెళ్లటానికి మరో ద్వారం లాంటి ఏర్పాటు చేస్తే బాగుండేది. కానీ.. అలాంటి ఏర్పాట్లు అధికారులు చేయలేదు. ప్రమాదం జరిగిన సమయంలో.. లోపలికి వెళ్లే వారు.. బయటకు వచ్చే వారి రద్దీ మూడు చోట్ల బాగా ఉండటం.. అసలేం జరుగుతుందన్న విషయం అర్థం కాకపోవటం.. తొక్కిసలాటకు దారి తీసింది. దీని కారణంగా ఏర్పడిన గందరగోళం ప్రమాద తీవ్రతను మరింత పెరగటానికి కారణమైంది.

మూడో తప్పు..

పుష్కర స్నానం కోసం ముఖ్యమంత్రి కోసం వచ్చిన పలువురు మంత్రులు..మిగిలిన వీఐపీలు రేవు ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాల్ని నిలిపి ఉంచారు. ముఖ్యమంత్రి.. మంత్రులు తిరిగి వెళ్లే సమయానికి రేవులోకి ఎవరిని అనుమతించకపోవటం.. సీఎంతో సహా మిగిలిన వారు వెళ్లిన వెంటనే.. ఒక్కసారి లోపలకు అనుమతించటం మరో పెద్ద తప్పు. అప్పటికే కిక్కిరిసిపోయిన రేవు ప్రాంతం.. ఇసుక వేస్తే రాలనంతగా జన సందోహం ఉంది. ఏ ద్వారం నుంచి జనాల్ని లోపలకు పంపాలి? ఏ ద్వారం నుంచి బయటకు పంపాలన్న విషయంపై స్పష్టత లేకపోవటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

నాలుగో తప్పు..

రేవు ద్వారం వద్ద.. జన సందోహాన్ని నియంత్రించేంతగా పోలీసు బలగాలు లేవు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మేల్కొన్నారు. రేవుకు వచ్చే వారిని ఇతర రేవులకు వెళ్లాలని చెబుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలు జారీ చేసే సమయానికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 27 మంది నిండు ప్రాణాల్లో గాల్లోకి కలిసిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం అమాయక ప్రజల పాలిట మృత్యుదండనగా మారింది.

ఐదో తప్పు..

తొక్కిసలాట జరిగిన తర్వాత.. ప్రధమ చికిత్స కోసం.. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశామని చెప్పిన 108 అంబులెన్స్ లు కానీ.. పారా మెడికల్ విభాగాలు కానీ కనిపించలేదు. తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి.. 108 అంబులెన్స్ చేరుకోవటానికి దాదాపు అరగంటకు పైనే ఎక్కువ సమయం పట్టింది. ఒకవేళ తొక్కిసలాట జరిగిన వెంటనే.. వైద్య సేవలు అందుబాటులో ఉండి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు.