Begin typing your search above and press return to search.
ఎన్నికల ముందు బీజేపీకి ఆ సీనియర్ గుడ్ బై
By: Tupaki Desk | 25 Jun 2018 4:39 PM GMTఅసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్తాన్ లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఘనశ్యామ్ తివారి బీజేపీకి గుడ్ బై చెప్పారు. తన రాజనామ లేఖను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్పించారు. రాజస్తాన్ సీఎం వసుంధరా రాజేతో ఆయనకు గత కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం నాటి పరిస్థితులు సృష్టించారంటూ కలకలం రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘన్‌శ్యామ్ గత ఎన్నికల్లో(2013) రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. రాజస్తాన్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఘన్ శ్యామ్ ప్రస్తుతం సంగానర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాజీనామా చేసిన సందర్భంగా ఘన్ శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలోని సీనియర్ నాయకులకు సరియైన స్థానం కల్పించకుండా ఫిరాయింపు నేతలకే వసుంధరా రాజే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పి తను అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ విధించడం సులభమని పేర్కొంటూ ప్రస్తుం ఆ పరిస్థితి లేనందున పరోక్షంగా ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా..ఘన్ శ్యామ్ తనయుడు అఖిలేష్ ఇప్పటికే భారత్ వాహిని పార్టీ పేరుతో రాజకీయ వేదికను ప్రారంభించారు. ఈ ఏడాది చివరలో జరగనున్న రాజస్తాన్ ఎన్నికల్లో 200 మంది అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఘన్ శ్యామ్ రాజీనామా చేయడం పైగా బీజేపీ పెద్దలను ప్రధానంగా సీఎంను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.