Begin typing your search above and press return to search.

తెరాస లో టిక్కెట్ల లొల్లి..

By:  Tupaki Desk   |   10 Sep 2018 6:16 AM GMT
తెరాస లో టిక్కెట్ల లొల్లి..
X
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తన తొలి జాబితాను ప్రకటించింది. జాబితాను ప్రకటించిన నాటి నుండి పార్టీలో అసంత్తుప్తి సెగలు బయటపడ్డాయి. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కొంత మంది నాయకులు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలోని కొందరు ముఖ్యులు ఇటువంటి లోపాయికార రాజకీయాలకు పూనుకుంటున్నారని కొంతమంది అభ్యర్దులు ఆరోపిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాలలో తెరాస పార్టీ అభివృద్ధికి చాలా పాటు పడ్డామని - తీరా టిక్కెట్లు ఇచ్చే సమయానికి మొండి చేయి చూపించారని వారు వాపోతున్నారు. నియోజకవర్గాలలో బలహీనంగా ఉండే అభ్యర్దులకే టీఆర్ ఎస్ టిక్కెట్లు కేటాయించిందని పార్టీలోని కొందరి నేతల అభిప్రాయం. రాబోయే ఎన్నికలలో గెలుపు ఖాయం అని బలంగా నమ్ముతోంది తెలంగాణ రాష్ట్ర సమితి. గెలుపు తర్వాత పరిణామాలను ద్రుష్టిలో పెట్టుకుని టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు పార్టీలో కొందరి నేతల వాదన. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి అధికాంలోకి వస్తే గనుక మంత్రి పదవులు కేటాయింపు విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో బలహీనులకు టిక్కెట్లు కేటాయిస్తున్నారని భావిస్తున్నారు.

అయితే అధిష్టానం దగ్గర పలుకుబడి ఉన్న నాయకులు కొందరు - వారి పరపతిని ఉపయోగించుకుని వారి అభ్యర్దులకే టిక్కెట్లు ఇప్పించుకున్నారని - భంగపడ్డ నాయకులు మండిపడుతన్నారు. టిక్కెట్ల ఆశ చూపించి తమను పార్టీ లోకి చేర్చుకుని ఇప్పుడు పొగ పెట్టారని ఇతర పార్టీల నుంచి టీఆర్‌ ఎస్‌ లో చేరిన కొందరి రాజకీయ నేతల వాదన. ఏదైతేనేమి టీఆర్ ఎస్ పార్టీ తమ అభ్యర్దులను ప్రకటించినప్పటి నుంచి పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీలో టిక్కెట్టు ఆశించి భంగపడ్డ కొందరు నేతలు వలసల బాట పట్టారు. తుంగతుర్తి నియోజకవర్గం టిక్కట్టు గాదరి కిశోర్‌ కు ఇవ్వటంపై - మోత్కూరులో నిరసన జ్వాలలు చెలరేగాయి. వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ అభ్యర్ది కొండా సురేఖ టిక్కెట్టు దక్కలేదని - కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. అలాగే టీఆర్ ఎస్‌ పార్టీలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు కూడా ఇతర పార్టీలకు వలస పోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అసంత్రుప్తి సెగలపై టీఆర్ ఎస్ అధిష్టానం సీరియస్‌ గా ఉందని వినికిడి. భంగపడ్డ నాయకులను - అభ్యర్దులను బుజ్జగించే పనిలో పడింది. అసంత్రుప్త నేతలను బుజ్జగించే బాధ్యత ఆ జిల్లాకు చెందిన మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. బుజ్జగింపులతో పాటు ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌ - తెలుగుదేశం కదలికలను గమనిస్తూ ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.