Begin typing your search above and press return to search.

రెబ‌ల్ స్టార్ సినిమాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు: ప్ర‌ధాని మోడీ

By:  Tupaki Desk   |   11 Sep 2022 7:48 AM GMT
రెబ‌ల్ స్టార్ సినిమాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు:  ప్ర‌ధాని మోడీ
X
కేంద్ర మాజీ మంత్రి, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు (83) సెప్టెంబ‌ర్ 11, ఆదివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. రెబ‌ల్ స్టార్ సినీ, రాజ‌కీయ రంగాల్లో చేసిన సేవ‌ల‌ను అంతా కొనియాడుతున్నారు. కృష్ణంరాజు కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. కృష్ణంరాజు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేశారు. కృష్ణంరాజు మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఆయన సినిమాలు భ‌విష్య‌త్తు త‌రాల‌కు మార్గద‌ర్శ‌క‌త్వం చేస్తాయని ప్ర‌ధాని పేర్కొన్నారు. కృష్ణం రాజు సినిమాల్లోని మాధుర్యం, సృజనాత్మకతను భవిష్యత్తు తరాలు అందిపుచ్చుకుంటాయ‌ని ఆకాంక్షించారు. సామాజిక సేవలోనూ ముందుండే ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారని ప్ర‌ధాని గుర్తు చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధాని ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.

అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా కృష్ణంరాజు మృతిపై తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

ఆయ‌న తెలుగులో ట్వీట్ చేయ‌డం విశేషం. తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని అమిత్ షా త‌న‌ సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణంరాజు బహుముఖ నటనతో, సామాజిక సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని అమిత్ షా కొనియాడారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ కృష్ణంరాజు మృతిప‌ట్ల తీవ్ర విచారం, సంతాపం వ్య‌క్తం చేశారు. 1999 నుంచి 2004 వ‌ర‌కు ఎంపీగా ప‌నిచేశార‌ని, కేంద్ర మంత్రిగా గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ, రక్షణ మరియు విదేశీ వ్యవహారాల శాఖలను నిర్వహించారని గ‌వ‌ర్న‌ర్ గుర్తు చేశారు. కృష్ణంరాజు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకున్నారు. కృష్ణంరాజు కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా కృష్ణంరాజు మృతికి తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా అని జ‌గ‌న్ త‌న ట్వీట్ లో సంతాపం వ్య‌క్తం చేశారు.

కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం వెండితెరకు తీరని లోటని అభివర్ణించారు. కేంద్ర మంత్రిగానూ కృష్ణంరాజు దేశ ప్రజలకు సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన తన అద్భుత నటనతో అశేష అభిమానం సంపాదించుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కృష్ణం రాజు మృతికి సంతాపం ప్రకటించారు. 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని రేవంత్‌ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.