Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: తెలుగు నేలను వదిలి వెళ్లిపోయిన రెబల్ స్టార్

By:  Tupaki Desk   |   11 Sep 2022 3:29 AM GMT
బ్రేకింగ్: తెలుగు నేలను వదిలి వెళ్లిపోయిన రెబల్ స్టార్
X
మరో సినీ ప్రముఖుడు తెలుగు ప్రజల్ని.. తెలుగు నేలను విడిచి పెట్టి శాశ్వితంగా వెళ్లిపోయారు. తిరిగి రాని లోకాలకు పయమనయ్యారు. రెబల్ స్టార్ గా సుపరిచితుడు కృష్ణంరాజు (83) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం ఉదయం 3.25 గంటల వేళలో చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో.. తెలుగు నటుల్లో విలక్షణ రీతిలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నట దిగ్గజం వెళ్లిపోయి.. తెలుగు వారిని శోక సంద్రంలో మునిగిపోయేలా చేసిందని చెప్పాలి. టాలీవుడ్ ఒక మేరునగ నటుడ్ని కోల్పోయిందని చెప్పాలి.

ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అలియాస్ కృష్ణంరాజుగా సుపరిచితులైన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయనకు భార్య.. ముగ్గురు కుమార్తెలు (ప్రసిదీ, ప్రకీర్తి, ప్రదీప్తి) . ఆయన సోదరుడు కుమారుడే ప్రభాస్. దాదాపు 183 చిత్రాల్లో నటించిన ఆయన.. 1966లో చిలకా గోరింక చిత్రంలో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ మధ్యనే విడుదలైన రాధేశ్యామ్ లో ఆయన చివరిసారిగా కనిపించారు. ఈ చిత్రంలో సోదరుడు కొడుకు ప్రభాస్ కు గురువుగా కనిపించారు. యాక్షన్ హీరోగా తన మార్కును ప్రదర్శించిన ఆయన.. చారిత్రక.. పౌరాణిక చిత్రాల్లోనూ నటిస్తూ తన సత్తా చాటారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ ఒక వెలుగు వెలిగిపోతున్న వేళ.. కృష్ణంరాజు రెబ్ల స్టార్ గా తన సత్తా చాటారు.

మానవుడు - దానవుడు, ఇన్ స్పెక్టర్ భార్య, శ్రీవారు మావారు, మాయదారి మల్లిగాడు, పల్లెటూరి చిన్నోడు, గుండెలు తీసిన మొనగాడు, భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, రాముడు రంగడు చిత్రాల్లో నటించిన ఆయనకు 1979లో విడుదలైన రంగూన్ రౌడీ కొత్త తరహా ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. 1980లో విడుదలైన బెబ్బులి, 1982లో గొల్కొండ అబ్బులు, అదే ఏడాదిలో విడుదలైన ప్రళయ రుద్రుడు, త్రిశూలం, 1983లో పులిబెబ్బులి, ధర్మాత్ముడు, 1984లో కొండవీటి నాగులు, ఎస్పీ భయంకర్ సినిమాలు ఆయన ఇమేజ్ ను పెంచాయి.

ఈ సినిమాలననీ ఒక ఎత్తు అయితే 1984లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం ఆయన కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలవటమే కాదు.. అప్పటివరకు ఇతర స్టార్ లకు ఫ్యాన్స్ గా ఉన్న వారు సైతం కృష్ణంరాజు అభిమానులుగా మార్చేసిన సినిమాగా చెప్పాలి. ఆ తర్వాత ఆయన కెరీర్ లో నిలిచిపోయిన మరో పెద్ద చిత్రంగా తాండ్రపాపారాయుడు చిత్రాన్ని చెప్పాలి. విలక్షణమైన పాత్రలో మరణశాసనం మూవీ ఆయన సినిమాల్లో మరో ఆణిముత్యంగా చెప్పాలి. 1997 వరకు వరుస పెట్టి సినిమాలు తీసిన ఆయన.. ఆ తర్వాత మూడేళ్ల తర్వాత 2000లో సుదీర్ఘ బ్రేక్ తర్వాత సర్దార్ మూవీలో నటించారు. ఆ తర్వాత నుంచి అడపదడపా అన్నట్లుగా నటించారు. ఆయన చివరి చిత్రం రాధేశ్యామ్.