Begin typing your search above and press return to search.

గుడిని క‌ట్టాలంటున్న పాక్ సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   26 Aug 2015 11:33 AM GMT
గుడిని క‌ట్టాలంటున్న పాక్ సుప్రీంకోర్టు
X
ముస్లిం దేశ‌మైన పాకిస్థాన్‌లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు వెలువ‌డించింది. గుళ్ల‌ను కూల్చేయ‌ట‌మే కానీ.. దాని మీదా ఎలాంటి స్పంద‌నా ఉండ‌ని పాక్ లో.. ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఒక కీల‌క తీర్పు ఇచ్చింది.
1919లో నాటి భార‌త‌దేశంలో భాగ‌మైన ప్ర‌స్తుత పాక్‌లోని క‌రాక్ జిల్లాలో శ్రీ ప‌ర‌మ‌హంస జీ మ‌హ‌రాజ్ మ‌ర‌ణించారు. ఆయ‌న్ను ఆరాధించే శిష్యులు ఒక దేవాల‌యాన్ని అప్ప‌ట్లో నిర్మించారు. 1997 వ‌ర‌కూ ఆ గుళ్లో పూజ‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ఈ దేవాల‌యాన్ని కూల్చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో ఒక ద‌ర‌ఖాస్తు దాఖ‌లైంది.

తాజాగా ఈ కేసును విచారించిన పాక్‌ సుప్రీంకోర్టు.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కూల్చేసిన ఈ దేవాల‌యాన్ని నిర్మించాల్సిందేన‌ని ప్ర‌భుత్వానికి తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో కూడిన ముగ్గురు స‌భ్యులున్న ధ‌ర్మాస‌నం దేవాల‌యాన్ని తిరిగి నిర్మించాల‌న్న అంశాన్ని తేల్చి చెబుతూ నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. అంతేకాదు.. హోంశాఖ కార్య‌ద‌ర్శి.. ఎవ‌రెవ‌రితో క‌లిసి చ‌ర్చించి.. ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలో కూడా స్ప‌ష్టంగా పేర్కొంది. అంతేకాదు.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా.. దేవాల‌య నిర్మాణాన్ని పూర్తి చేయాల‌ని ఆదేశించింది. అంతేకాదు.. తాను పేర్కొన్న నిపుణుల‌తో దేవాల‌య నిర్మాణం గురించి చ‌ర్చించి.. ఆ విష‌యాల్ని కోర్టుకు తెల‌పాల్సిందిగా చెబుతూ.. ఈ కేసును సెప్టెంబ‌రు 7కు వాయిదా వేసిన‌ట్లు పాక్ ప‌త్రిక డాన్ పేర్కొంది. ఏమైనా.. పాక్‌ లో కూల్చేసిన ఒక దేవాల‌యం మీద ఇంత జ‌ర‌గ‌టం కాస్తంత విశేష‌మే అంటున్నారు.