Begin typing your search above and press return to search.

యూఎస్ లో రీకాల్ చేసిన మన డ్రగ్స్ జాబితా ఇదే

By:  Tupaki Desk   |   16 Aug 2022 4:36 AM GMT
యూఎస్ లో రీకాల్ చేసిన మన డ్రగ్స్ జాబితా ఇదే
X
అమెరికాలో మన దేశానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలకు సంబంధించిన డ్రగ్స్ (ఔషధాలు)ను రీకాల్ చేస్తున్నారు. ఉత్పత్తి సమయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకున్నా.. అనుకోని లోపాల్ని గుర్తించినా.. వెంటనే వాటిని వెనక్కి రప్పించేయటం తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితిని దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ జనరిక్ ఫార్మా కంపెనీలుగా పేరొందిన గ్లెన్ మార్క్.. సన్ ఫార్మా.. డాక్టర్ రెడ్డీస్.. జూబలెంట్ కాడిస్టాలకు చెందిన పలు ఔషధాల్ని అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్ని అమెరికాకు చెందిన పుడ్ అండ్ డ్రగ్ ఆడ్మినిస్ట్రేషన్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో తయారీ సమస్యలతో పాటు.. తయారీ సందర్భంగా పాటించాల్సిన ప్రమాణాల విషయంలో చోటు చేసుకున్న లోపాల నేపథ్యంలో రీకాల్ చేపట్టారు. అమెరికా జెనరిక్ డ్రగ్ మార్కెట్ భారీగా ఉంటుంది. 2019 లెక్కల ప్రకారం సుమారు 115.2 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల విలు రూ.24.6 బిలియన్ డాలర్లు. దేశీయంగా డాలర్లను కురిపించే ఈ మార్కెట్ లో ఏ చిన్న లోపాన్ని గుర్తించినా మందుల్ని రీకాల్ చేస్తుంటారు.

అలా రీకాల్ చేసిన ఔషధాలను చూస్తే.. ముంబయికి చెందిన గ్లెన్ మార్క్ ఫార్మాకంపెనీకి చెందిన 6.5 లక్షల జనరిక్ స్కిన్ ట్రీట్ మెంట్ ఆయింట్ మెంట్ ను రీకాల్ చేస్తున్నారు. గ్లెన్ మార్క్ కు అనుబంధ సంస్థగా వ్యవహరించే గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇన్ కార్పొరేషన్ తయారు చేసిన చర్మ వ్యాధులకు ఉపయోగించే ఆయింట్ మెంట్ కు సంబంధించి డిఫెక్టివ్ కంటైనర్ కారణంగా ఈ ఏడాది జులై 11 నుంచి అమెరికా వ్యాప్తంగా ఉన్న స్టాక్ ను రీకాల్ చేశారు.

సన్ ఫార్మాకు సంబంధించిన మూర్చ వ్యాధి చికిత్సకు ఉపయోగించే డివల్ ప్రోయెక్స్ సోడియం 9552 బాటిళ్లను 'ఫెయిల్డ్ డిసోల్యూషన్ స్పెసిఫికేసన్స్' కారణంగా రీకాల్ చేశారు. ఈ లాట్ ఔషధాన్ని భారత్ లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన హలోల్ ప్లాంట్ లో తయారు చేశారు.
అంతేకాదు.. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా మంచి పేరున్న రెడ్డీస్ ల్యాబరేటరికి చెందిన లాన్స్ ప్రజోల్ టాబ్లెట్లను 'డిసొల్యూషన్ స్పెసిఫికేషన్' కారణంగా భారీ ఎత్తున రీకాల్ చేస్తున్నారు. నివేదిక ప్రకారం 5531 కార్టన్ల స్టాక్ ను రీకాల్ చేస్తున్నారు. అంతేకాదు జూబిలెంట్ కాడిస్టా ఫార్మాస్యూటికల్స్ కు సంబంధించిన బీపీని కంట్రోల్ చేసే ఇర్బెసార్టన్ టాబ్లెట్లు (150, 75 ఎంజీ) కూడా పెద్ద ఎత్తున రీకాల్ చేశారు. దాదాపు 38వేలకు పైగా బాటిళ్లు వెనక్కి తెప్పిస్తున్నారు. ఈ టాబ్లెట్ల బ్యాచ్ ను రూర్కీ ప్లాంట్ లో ఉత్పత్తి చేసినట్లుగా చెబుతున్నారు.