Begin typing your search above and press return to search.

చంపేస్తామని వార్నింగ్ లు ఇచ్చారన్న పవన్

By:  Tupaki Desk   |   11 Feb 2017 11:38 AM GMT
చంపేస్తామని వార్నింగ్ లు ఇచ్చారన్న పవన్
X
ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీలో ప్రసంగించేందుకు అమెరికాకు వెళ్లిన జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక సభలో ప్రసంగించారు. న్యూ హ్యాంప్ షైర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన గురించి.. తన రాజకీయ అభిలాష.. మైండ్ సెట్.. ఫిలాసఫీ.. సినిమాలు ఇలా చాలానే అంశాలపై ప్రసంగించారు. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు చప్పట్లు.. ఈలలతో ప్రాంగణం హోరెత్తటం గమనార్హం.

కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ తాను ఒక సంస్థను స్థాపించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని.. ఆ సందర్భంలో తనను చాలా మంది చాలారకాలుగా వార్నింగ్ లు ఇచ్చారన్నారు. చివరకు లేఖలు.. మొయిల్స్ కూడా తనకు వచ్చాయని.. వాటిల్లోతనను బండబూతులు తిట్టేసే వారుకొందరైతే.. తనను చంపేస్తామని హెచ్చరించే వారు మరికొందరు ఉండేవారన్నారు. అయితే.. ఇలాంటి వాటిని తానుఅస్సలు పట్టించుకోలేదన్నారు.

తాను కానీ రాజకీయాలు వద్దని అనుకుంటే తనకీ బెదిరింపులు ఏమీ ఉండేవి కావని.. చక్కగా హాలీవుడ్ స్టూడియోలు తిరుగుతూ.. థీమ్ పార్కుల్లో ఎంజాయ్ చేసే వీలు ఉండేదన్నారు. అయితే.. తనకు రాజకీయాలంటే ఇష్టమని.. అందుకే బెదిరింపులకు తాను బెదర్లేదన్నారు. ఒకవేళ తాన కానీ భయపడి ఉంటే ఇక్కడి వరకూ వచ్చేవాడిని కాదని.. తనకు అసలు భయం అన్నదే లేదని స్పష్టం చేశారు.

తాను మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడతానని.. ఏదైనా విషయం మీద ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్న తర్వాత తన మాట నోటి నుంచి వస్తుందన్నారు. కానీ..ఏదైనా అంశం మీద కానీ ఒక స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం.. దాన్ని పూర్తి చేసే వరకూ తాను నిద్రపోనని స్పష్టం చేశారు. ఏదైనా అంశం మీద ఒక నిర్ణయానికి వచ్చాక.. ఎలాంటి పరిస్థితులకైనా తలవంచేప్రసక్తే లేదని.. ఎంతకైనా సిద్ధమని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా ఒక సామెతను ప్రస్తావిస్తూ.. నిత్యం భయపడుతూ బతికే కన్నా.. ఒకేసారి చావటం మంచిదని.. అందుకే తానెప్పుడూ ఏ విషయానికి భయపడనని చెప్పారు. ఈ సందర్భంగా అమెరికాపూర్వ అధ్యక్షుడు కెన్నడీ మాటల్ని ప్రస్తావిస్తూ..నీకు నీ దేశం ఏం ఇచ్చిందన్న విషయం గురించి కాదు.. ముందు నువ్వు నీ దేశానికి ఏం చేశావో ఆలోచించన్న మాటను నమ్ముతానన్నారు. తన కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే మాత్రం తాను చూస్తూ ఊరుకోనన్న పవన్.. కుల రాజకీయాల్ని తాను అస్సలు పట్టించుకోనన్నారు. చుట్టూ ఉన్న అంశాల్ని పరిశీలించటం.. సమాజాన్ని చదవటం ఇష్టమన్న ఆయన.. సినిమాల్లో నటించటం తనకేమాత్రం సౌకర్యవంతంగా ఉండదన్న వ్యాఖ్యానించారు. పవన్ ప్రసంగం అక్కడి వారిని ఆకట్టుకోవటమే కాదు.. ప్రతి విషయం పట్ల తనకున్న అవగాహనను సూటిగా.. స్పష్టంగా చెప్పిన శైలి అందరిని ఆకట్టుకుందన్న మాట వినిపించింది.