Begin typing your search above and press return to search.

లక్కంటే మనోడిదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..!

By:  Tupaki Desk   |   25 Dec 2022 11:18 AM IST
లక్కంటే మనోడిదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..!
X
లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఎవరిపై కలుగుతుందో ఊహించడం కష్టం. అదృష్ట జాతకులు రాత్రికే రాత్రి కోటీశ్వరులు కావచ్చని ఎన్నో సంఘటనలు గతంలో నిరూపించాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు తరుచూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కారు డ్రైవర్ కు జాక్ పాట్ తగలడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ చెందిన అజయ్ ఓగులా నాలుగేళ్ల క్రితం పని కోసం దుబాయ్ కి వెళ్ళాడు. అక్కడే ఓ నగల షాపులో కారు డ్రైవర్ గా నెలకు 72వేల (3,200 దిర్హామ్ లు) జీతానికి పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దుబాయ్ ‘ఎమిరేట్స్ డ్రా’ కు సంబంధించి లాటరీ టికెట్ ను అజయ్ ఓగులా కొనుగోలు చేశాడు.

తాజాగా ఈ లక్కీ డ్రాను గెలుచుకున్న విజేతలను దుబాయ్ ఎమిరేట్స్ నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో అజయ్ ఓగులా ఏకంగా 33 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అయితే తనకు లక్కీ డ్రా తగిలిందంటే ముందుగా నమ్మలేదని అజయ్ ఓగులా తెలిపాడు.

ఇక ఈ విషయాన్ని తొలుత తన కుటుంబీకులకు చెప్పినప్పుడు వారంతా నమ్మ లేదన్నాడు. తనకు లాటరీ తగిలిన విషయం మీడియాలో వచ్చాక వారంతా నిజమని నమ్మారని చెప్పాడు. తనకు లక్కీ లక్ష్మి లభించినందుకు ఆనందంగా ఉందని అజయ్ ఓగులా వివరించాడు. ఈ డబ్బుతో తన కుటుంబ సభ్యుల కోరికలను.. తన కలలన్నింటిని నెరవేర్చుకుంటున్నానని తెలిపాడు.

అంతేకాకుండా ఈ డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి తమ గ్రామంతో పాటు.. చుట్టుపక్కల ఉన్న పేదలకు సాయం చేస్తానని చెప్పాడు. ఇక ఇదే లాటరీలో బ్రిటిష్ మూలానికి చెందిన పౌలా లీచ్ రూ. 17.5 లక్షలు (దిర్హం 77,777) గెలుచుకోవడం గమనార్హం.