Begin typing your search above and press return to search.

యనమల పంటినొప్పి గురించి చెప్పిన గుడివాడకు సీఎం వైఫ్ ను డ్రాప్ చేసిన ముచ్చట గుర్తుకు రాదే?

By:  Tupaki Desk   |   7 Nov 2022 1:30 PM GMT
యనమల పంటినొప్పి గురించి చెప్పిన గుడివాడకు సీఎం వైఫ్ ను డ్రాప్ చేసిన ముచ్చట గుర్తుకు రాదే?
X
రాజకీయం చేసే పార్టీలన్నీ ఒక తానులోనివే. పైకి చెప్పే విలువలు.. తమ వరకు వస్తే మాత్రం వాటిని ఆచరించేందుకు ఏ మాత్రం ఇష్టపడని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక.. ప్రత్యర్థి పార్టీపై విరుచుకుపడే వైసీపీ నేతలు.. గురివింద తరహాలో వ్యవహరించటం వారి ఇమేజ్ ను దెబ్బ తీస్తోంది. విలువల గురించి మాట్లాడేటప్పుడు తమ వైపు నుంచి ఎలాంటి తప్పులు లేకుండా ఉండి ఉన్నప్పుడు.. వారు చేసే వ్యాఖ్యలకు అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. అందుకు భిన్నంగా చెప్పే మాటలకు చేసే పనులకు సింక్ కుదరకపోతేనే ప్రజల్లో పలుచన అయ్యే ప్రమాదం ఉంది.

తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులకు టీడీపీ సీనియర్ నేత.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల లెక్క చెప్పగలరా? అని ప్రశ్నించారు. యనమలకు పన్ను నొప్పి వస్తే సింగపూర్ వైద్యం కోసం రూ.2.5 లక్షలు ఖర్చు పెట్టిన యమనల ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడే నైతికత లేదని విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా ఎప్పటిలానే తమ వాదనను సమర్థంగా వినిపించటమే కాదు.. తమకుమించిన సుద్దపూసలు మరెవరూ ఉండరన్నట్లుగా మాటలు చెప్పటం గుడివాడలో కనిపిస్తుంది. యనమల పంటి నొప్పి ఖర్చు గురించి చెప్పిన గుడివాడ.. ఈ మధ్యనే తిరుపతికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి తన సతీమణి భారతిని హైదరాబాద్ లో డ్రాప్ చేయటం కోసం గన్నవరం నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్రత్యేక విమానాన్ని.

బేగంపేటకు తీసుకొచ్చి మరీ డ్రాప్ చేయటం.. మళ్లీ తిరుపతి నుంచి గన్నవరం రావాల్సిన జగన్.. అందుకు భిన్నంగా హైదరాబాద్ వచ్చి వైఫ్ ను తన ప్రత్యేక విమానంలో ఎక్కించుకొని మరీ గన్నవరం చేరిన వైనాన్ని మంత్రి గుడివాడ మర్చిపోవచ్చు కానీ.. మామూలు ప్రజలు మర్చిపోరు కదా?

రిటర్న్ జర్నీలో తిరుపతి నుంచి హైదరాబాద్ కు వచ్చి.. అక్కడ వైఫ్ భారతి కోసం జగన్ ఏకంగా 20 నిమిషాల పాటు ప్రత్యేక విమానంలోనే వెయిట్ చేసిన వైనం అప్పట్లో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతైనా భార్య భార్యేనని.. భర్త భర్తేనని.. ఆ విషయంలో సీఎం అయిన జగన్ కూడా తప్పలేదన్న సరదా మాట రాజకీయ నేతల మాటల్లో వినిపించింది. మరి.. ఇలాంటి ఖర్చుల గురించి మంత్రి గుడివాడ చెబితే బాగుంటుంది.

ఇక్కడ.. యనమలను సమర్థించటం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. మంత్రి గుడివాడ చెప్పినట్లు.. కేవలం పంటి నొప్పి ట్రీట్ మెంట్ కోసం యనమల రూ.2.5 లక్షలు ఖర్చు చేసి ఉంటే మాత్రం ఆయన తప్పు చేసినట్లే.

నిజానికి ఇలాంటి ఖర్చును భరించలేని దీన స్థితిలో యనమల ఉన్నప్పుడు.. ప్రభుత్వ ఖజానా మీద భారం పడేలా వ్యవహరించకూడదు. ఇలా చూసినప్పుడు ప్రజా ధానాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టని ఎవరైనా సరే తప్పు చేసినట్లే లెక్క. వారికి నీతులు వల్లించే నైతిక హక్కు ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.