Begin typing your search above and press return to search.

థకాలు మా డబ్బులతోనేగా.. వైసీపీ ఎమ్మెల్యేని నిలదీసిన వ్యక్తి!

By:  Tupaki Desk   |   2 Nov 2022 8:55 AM GMT
థకాలు మా డబ్బులతోనేగా.. వైసీపీ ఎమ్మెల్యేని నిలదీసిన వ్యక్తి!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్‌ జగన్‌.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు.

అయితే ఇంత చేస్తున్నా ప్రజల నుంచి కొంతమందికి నిరసనలు తప్పడం లేదు. అభివృద్ధి లేదని, తమకు పథకాలు అందడం లేదని ప్రజలు పలుచోట్ల ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మీడియాలో పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఎక్కడికక్కడ ప్రజలు వివిధ సమస్యలపై నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక.. సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేస్తున్నారని అంటున్నారు. మరికొంతమంది పోలీసులతో తమను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించడం వంటివి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైందని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణంలోని 2వ వార్డులో ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ క్రమంలో లబ్దిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు.

ఇదే సమయంలో తనది చిన్న గుడిసె అని.. రూ.1600 ఇంటి పన్ను తనకు ఎందుకు వస్తోందని శ్రీనివాస్‌ అనే వ్యక్తి ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని అడిగారు. ఇందులో మీ గొప్పేముంది.. తాము కట్టిన పన్నుల వల్లే కదా పథకాలు ఇస్తున్నారని శ్రీనివాస్‌ ఎమ్మెల్యేకు బదులు సమాధానం చెప్పాడు. ముందు ఇంటి పన్నులు, చెత్త పన్నులు తగ్గించాలని కోరాడు. అయితే అలా తగ్గించడం కుదరదంటూ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.