Begin typing your search above and press return to search.

శ్రీ‌వారు సిరివారు​:​ 3 రోజులు రూ.10కోట్లు

By:  Tupaki Desk   |   22 July 2015 9:07 AM GMT
శ్రీ‌వారు సిరివారు​:​ 3 రోజులు రూ.10కోట్లు
X
ప‌న్నెండేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే గోదావ‌రి పుష్క‌రాల‌కు జ‌నం పోటెత్తుతున్న రోజుల్లో.. గోదావ‌రి తీరంలోని దేవాల‌యాలు మిన‌హా మిగిలిన దేవాల‌యాలు ఓ మోస్త‌రు ర‌ద్దీ కూడా లేని ప‌రిస్థితుల్లో.. తిరుమ‌ల క్షేత్రం మాత్రం అందుకు భిన్నంగా భ‌క్తుల‌తో పోటెత్తిన ప‌రిస్థితి.

ఈసారి గోదావ‌రి పుష్క‌రాల‌కు మ‌రో ప్ర‌త్యేక ఉంది. ఇవి సాధార‌ణ పుష్క‌రాలు కావ‌ని.. 144 ఏళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే మ‌హా పుష్క‌రాలుగా చెప్ప‌టం తెలిసిందే.

ఒక‌ప‌క్క గోదావ‌రి పుష్క‌రాల‌కు నిత్యం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు బారులు తీరుతున్న వేళ‌.. గ‌త వారాంతంలో తిరుమ‌ల‌లో రికార్డు స్థాయిలో భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకోవ‌ట‌మే కాదు.. రికార్డు మొత్తంలో హుండీ ద్వారా స్వామివారికి ఆదాయం స‌మ‌కూరింది.

కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలో ప‌ది కోట్ల రూపాయిల మొత్తం (క‌చ్చితంగా చెప్పాలంటే రూ.9,92,49,590) స్వామి వారికి వ‌చ్చింది. ఇంత పెద్ద మొత్తం కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలో స‌మ‌కూరింది. అంతేకాదు.. మూడు రోజుల్లో భ‌క్తులు కూడా భారీగా స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. మూడు రోజుల్లో ఇంత భారీ మొత్తం హుండీ ద్వారా స‌మ‌కూర‌టం ఇదే మొద‌టిసారి అని చెబుతున్నారు.

ఇక‌.. స్వామివారిని ద‌ర్శించుకున్న భ‌క్తులు శుక్ర‌వారం 88 వేలు అయితే.. శ‌నివారం 91వేలు.. ఆదివారం 86 వేల మందిగా చెబుతున్నారు. ఓప‌క్క జోరుగా గోదావ‌రి పుష్క‌రాలు సాగుతున్న వేళ‌.. స్వామి వారి ద‌ర్శానానికి ఇంత డిమాండ్ తో పాటు ఇంత భారీ మొత్తంలో హుండీ ఆదాయాన్ని చూసిన‌ప్పుడు శ్రీ‌వారు.. సిరివారు అని అనిపించ‌క మాన‌దు.