Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో రికార్డ్ సృష్టించిన మార్చి 26

By:  Tupaki Desk   |   15 April 2020 9:30 AM GMT
తెలంగాణ‌లో రికార్డ్ సృష్టించిన మార్చి 26
X
ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ తెలంగాణ‌లో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లందరూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై క‌రోనా నివార‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా అమ‌లుచేసిన లాక్‌డౌన్ తెలంగాణ‌లోనూ స‌జావుగానే కొన‌సాగుతోంది. ఇందులో భాగంగానే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అత్యావ‌స‌ర‌మైతేనే బ‌య‌ట తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో రోడ్ల‌పై క‌నుచూపు మేర‌ల్లో కూడా వాహ‌నాలు క‌నిపించ‌డం లేదు. దీంతో రోడ్డు ప్ర‌మాదాలు - నేర చ‌రిత్ర భారీగా త‌గ్గింది. అయితే మార్చి 26 మాత్రం రికార్డ్ సృష్టించి ప్ర‌త్యేక రోజుగా నిలిచింది. ఆ రోజు తెలంగాణ‌లో రోడ్డు ప్రమాదం బారిన ప‌డి ఒక్క‌రు కూడా మృతి చెంద‌లేదు. ఈ విధంగా ఇలాంటి రోజు ఎప్పుడు లేద‌ని.. ఇదో రికార్డు అని రోడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు చెబుతున్నారు.

ఎంత కర్ఫ్యూ విధించినా.. రోడ్డు ప్రమాదాల మరణాలు ఆగిన దాఖలాలు లేవు. కానీ మార్చి 26 రోజున మాత్రం అలాంటి ప‌రిణామం చోటుచేసుకుంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని గ‌ణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్ర‌స్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని సంబంధిత అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మార్చి 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విధించి లాక్‌ డౌన్‌ తో వాహనాల రాకపోకలు పూర్తిగా తగ్గాయి. అయినా కూడా రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అతివేగం - నిర్లక్ష్యం - గూడ్స్‌ వాహనాల్లో ప్రజలను తరలించడం తదితర కారణాలతో ప్రమాదాలు జరిగి - ప్రాణ నష్టం అధికంగా ఉండేవ‌ని వివ‌రిస్తున్నారు. రోడ్‌ సేఫ్టీ విభాగం గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో సరాసరిన రోజుకు 60కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంట‌. 80 మందికి పైగా గాయాల‌పాల‌వుతుండగా, 19మంది మృతి చెందే వార‌ని వివ‌రించారు. గతేడాది తెలంగాణ‌ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో 6,964 మంది మృతి చెందారని లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే తేలింది.

లాక్‌ డౌన్‌ విధించిన రోజు నుంచి ఇప్పటి వరకు అత్యల్పంగా మరణాలు సంభ‌వించాయి. లాక్‌ డౌన్ కాలంలో మార్చి 22 నుంచి మార్చి 31వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిల్లో 52 మంది మృతిచెందగా - 142 మంది గాయపడ్డారు. ఏప్రిల్ నెల‌లో కూడా ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 7 వరకు 23 మంది మృతిచెందగా - 68 మంది గాయాల‌పాల్యారు. ఈ మరణాలను సాధారణ సగటుతో పోల్చి చూడగా.. రోజు మరణించే వారి సంఖ్య 19 నుంచి 4కు త‌గ్గాయి. లాక్‌ డౌన్ స‌మ‌యంలో వాహ‌నాలు లేక‌పోవ‌డంతో మితిమీరిన వేగం - నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్‌ తో అదుపుతప్పి పడిపోవడంతోనే సంభ‌వించాయ‌ని కారణాలు తెలిపారు. 2020 జ‌న‌వ‌రి నుంచి మార్చి వరకు తెలంగాణ‌లో నమోదైన రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య 1,538 ఉన్నాయ‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు.