Begin typing your search above and press return to search.

తాట తీయాలి: జూబ్లీహిల్స్ ఫుడ్ కోర్టులో మహిళా టాయిలెట్ లో రికార్డింగ్

By:  Tupaki Desk   |   23 Sep 2021 7:33 AM GMT
తాట తీయాలి: జూబ్లీహిల్స్ ఫుడ్ కోర్టులో మహిళా టాయిలెట్ లో రికార్డింగ్
X
ఒక దారుణం బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్ లోని ఒక ఫుడ్ కోర్టులో పని చేసే హౌస్ కీపింగ్ బాయ్ తీరు షాకింగ్ గా మారింది. లేడీస్ టాయిలెట్ లో తన సెల్ ఫోన్ పెట్టి.. రికార్డు చేస్తున్న నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. దీనిపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు.. ఈ దరిద్రుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జూబ్లీహిల్స్ లోని ఒక ఫుడ్ కోర్టు బాగానే పాపులర్. దీనికి సంబంధించి లేడీస్ బాత్రూం ఉంది. అక్కడ పని చేసే హౌస్ కీపింగ్ బాయ్.. తన సెల్ ఫోన్ ను లేడీస్ బాత్రూంలో రహస్యంగా ఉంచాడు. ఎవరికి వారు బాత్రూంకు వెళ్లటం.. రావటమే కానీ పరిసరాల్ని పరీక్షగా చూస్తున్నది లేదు.తాజాగా ఒక యువతి బాత్రూంకు వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని జాగ్రత్తగా చూడటం.. అక్కడ ఫోన్ ఉండటంతో వెంటనే ఆ సమాచారాన్ని యజమానికి సమాచారం ఇచ్చారు.

వెంటనే స్పందించిన ఫుడ్ కోర్టు యజమాని.. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హౌస్ కీపింగ్ బాయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు నల్గొండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల బొంగరాల బెనర్జీగా గుర్తించారు. ఆర్నెల్ల నుంచి అతడిక్కడ పని చేస్తున్నాడు. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని వీడియోల్ని చూసి షాక్ తింటున్నారు. తన సెల్ ఫోన్ వీడియో కెమేరా ఆన్ చేసి.. హోటల్ కు వచ్చే మహిళల్ని రహస్యంగా చిత్రీకరించేవాడు. మూడు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దరిద్రపుగొట్టు పని చేస్తున్నట్లు గుర్తించారు.

ఫోన్ లో దాదాపు 20 మహిళలకు సంబంధించిన వీడియోల్ని తీసినట్లుగా లెక్క తేల్చారు. ఇవే కాకుండా.. ఫోన్లో ఇంకేం వీడియోలు ఉన్నాయన్న దాన్ని పరిశీలిస్తున్నారు. మూడు రోజుల నుంచే ఈ తతంగం నడుస్తోందా? ఇంతుకు ముందు కూడా ఏమైనా వీడియోలు తీశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. బయట ప్రదేశాల్లో బాత్రూంకు వెళ్లే మహిళలు.. తప్పనిసరిగా చుట్టూ ఉన్న పరిసరాల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మరోసారి ఈ ఉదంతం గుర్తు చేసిందని చెప్పక తప్పదు.