Begin typing your search above and press return to search.

కరోనా నుంచి కోలుకున్నారా..? అయినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

By:  Tupaki Desk   |   19 May 2021 7:00 AM IST
కరోనా నుంచి కోలుకున్నారా..? అయినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
X
కరోనా మహమ్మారి దేశంలో జడలు చాస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల మంది వైరస్ ను జయించారు. కొవిడ్ నుంచి కోలుకోగానే అశ్రద్ధ పనికిరాదని నిపుణులు అంటున్నారు. మరికొన్నాళ్ల పాటు జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. చాలామంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నాక ఇతర సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.

సహజంగా కొవిడ్ అనగానే జలుబు, దగ్గు, కొంచెం జ్వరం అని అంతా అనుకుంటున్నారు. కానీ వైరస్ శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె, మెదడు, ధమనులు, సిరలు వంటి అవయవాలపై మహమ్మారి ప్రభావం చూపుతోందని వెల్లడించారు. వైరస్ నుంచి కోలుకున్నాక క్రమంగా నిస్సత్తువ, నిద్రలేమి, గుండెపోటు, శ్వాస తీసుకోవడంలో సమస్య, రక్తం గడ్డ కట్టుట, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.

స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో చాలామంది ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ వైరస్ ను జయిస్తున్నారు. ఆ తర్వాత మరో పదిహేను రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కోలుకున్నాక ఏ లక్షణం, సమస్య లేదనుకుంటే పోస్ట్ కొవిడ్ టెస్ట్ అవసరం లేదు అంటున్నారు. కొన్నాళ్ల పాటు ప్రోటీన్ల కూడిన మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.

కరోనా నుంచి కోలుకోవడానికి ఒక్కక్కరికి ఒక్కో సమయం పడుతుంది. స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ సేపు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు. యోగా, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. సొంత వైద్యం అస్సలు పనికిరాదని హెచ్చరించారు.

మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది ఉన్నా వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. వీలైనంత సేపు నిద్రపోవాలని సూచించారు. మంచి ఆహారం, వ్యాయామాలు అవసరం అని చెప్పారు. వీరికి మనోబలం అవసరం కాబట్టి కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగు వారి సాయం అవసరమని అన్నారు. ఆక్సిజన్, చక్కెర స్థాయిలను తరుచుగా పరీక్షించుకోవాలని సూచించారు. వీలైనంత వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండడం ఉత్తమం అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో జరిగే మార్పులను గమనించాలని చెప్పారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని వ్యాఖ్యానించారు.