Begin typing your search above and press return to search.

షాక్‌: 'హెరిటేజ్ వాహ‌నం'లో ఎర్ర‌చంద‌నం!

By:  Tupaki Desk   |   4 July 2017 9:47 AM GMT
షాక్‌: హెరిటేజ్ వాహ‌నంలో ఎర్ర‌చంద‌నం!
X
ఏపీ అధికారుల‌కు దిమ్మ తిరిగే షాక్ ఒక‌టి త‌గిలింది. ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ల అతి తెలివికి నోట మాట రాని ప‌రిస్థితి. కోట్ల రూపాయిల విలువైన ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని అక్ర‌మంగా త‌ర‌లించేందుకు వారు వేసిన ఎత్తులు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశాలుగా మార‌ట‌మే కాదు.. షాకింగ్ గా మారాయి. త‌మ స్మ‌గ్లింగ్‌ కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల వాహ‌నంగా పెయింట్ చేసి స్మ‌గ్లింగ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. అనుమానం వ‌చ్చిన పోలీసులు త‌నిఖీ చేయ‌గా ఈ షాకింగ్ ఉదంతం బ‌య‌ట‌ప‌డింది.

తిరుప‌తి నుంచి రూ.3కోట్ల ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న హెరిటేజ్ వాహ‌నాన్ని పోలీసుల‌సు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఇది అస‌లుసిస‌లు హెరిటేజ్ వాహ‌నం కాదు. మామూలు వాహ‌నానికి హెరిటేజ్ పాల వాహ‌నంగా పెయింట్ చేసిన నిందితులు.. పోలీసుల్ని బోల్తా కొట్టించేందుకు కొత్త ఎత్తు వేశారు.

ముఖ్య‌మంత్రి కుటుంబానికి చెందిన కంపెనీ వాహ‌నాన్ని సాధారణంగా ఆప‌ర‌న్న ఆలోచ‌న‌తో.. హెరిటేజ్ పాల వాహ‌నంగా మార్చేసి అందులో కోట్లాది రూపాయిల విలువైన దుంగ‌ల్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా త‌ర‌లించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

అయితే.. ఈ దుర్మార్గానికి సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అప్ర‌మ‌త్త‌మై.. న‌కిలీ హెరిటేజ్ వాహ‌నాన్ని వెంబ‌డించారు. పోలీసుల నుంచి త‌ప్పించుకునేందుకు స్మ‌గ్ల‌ర్లు రాళ్లు విసర‌గా.. వారి ఆట క‌ట్టించేందుకు పోలీసులు ఏకంగా గాల్లోకి కాల్పులు జ‌ర‌ప‌టంతో భ‌య‌ప‌డిన స్మ‌గ్ల‌ర్లు వాహ‌నాన్ని రోడ్డు మీద విసిరేసి పారిపోయారు.

వాహ‌నంలో రూ.3కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం దుంగ‌లు ఉన్న‌ట్లుగా గుర్తించారు. త‌మిళ‌నాడులో రిజిస్ట‌ర్ అయిన వాహ‌నానికి ఏపీ నెంబ‌రు ప్లేట్ త‌గిలించి.. న‌కిలీ హెరిటేజ్ వాహ‌నంగా త‌యారు చేసి.. ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని అక్ర‌మంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదిలా ఉండ‌గా అంత‌ర్జాతీయ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌.. క‌ర్ణాట‌క‌కు చెందిన హాజీ నాజిర్‌ ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌తో పాటు.. నాలుగు ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగేళ్లుగా అక్ర‌మ ఎర్ర‌చంద‌నం ర‌వాణాలో కీల‌క పాత్ర పోషిస్తున్న హ‌జీనాజిర్‌ ను ప‌ట్టుకోవ‌టానికి చిత్తూరు జిల్లా పోలీసులు చాలానే ప్ర‌య‌త్నించారు. అయినప్పటికీ అత‌న్ని అదుపులోకి తీసుకోవ‌టం సాధ్యం కాలేదు. తాజాగా అత‌న్ని అదుపులోకి తీసుకోవ‌టంపై అధికారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక అంచ‌నా ప్ర‌కారం.. హ‌జీ నాజ‌ర్ సుమారు వెయ్యి ట‌న్నుల ఎర్ర‌చంద‌నాన్ని స్మ‌గ్లింగ్ చేసి ఉంటార‌ని అంచ‌నా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/