Begin typing your search above and press return to search.

వాడు ఎర్రకూలీ ఎందుకవుతాడు..?

By:  Tupaki Desk   |   8 April 2015 4:08 AM GMT
వాడు ఎర్రకూలీ ఎందుకవుతాడు..?
X
ఇప్పుడో పెద్ద ప్రశ్న తెరపైకి వచ్చింది. ఓ పెద్ద గ్యాంగ్‌స్టర్‌ ఉన్నాడు. అతడు చేసే నేరాలకు సహకారం అందిస్తూ.. అతను చేసే వెధవ పనులన్నింటికి సాయం చేస్తూ.. అన్నిపనులు చేసే వ్యక్తిని ఏమంటారు? గ్యాంగ్‌స్టర్‌ గ్యాంగ్‌లో సభ్యుడు అంటామా? లేక.. కూలీ అంటామా? లేక.. గ్యాంగ్టసర్‌ దగ్గర పని చేసే ప్రైవేటు ఉద్యోగి అంటామా?

కాస్త ఆలోచించే వారు ఎవరైనా గ్యాంగ్‌ సభ్యుడు అంటారే కానీ.. కూలీ.. ఉద్యోగి లాంటి మాటలు అనరు. మరి.. గ్యాంగస్టర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అటవీ సంపదను దోచుకెళుతూ.. పని చేసే వారిని ఎర్రకూలీ అని ఎందుకు అంటారు? అలా అనటంలో అర్థం ఉందా? అందులో కనీస న్యాయం ఉందా?

పర్యావరణాన్ని దెబ్బ తీయటంతో పాటు.. అత్యంత విలువైన జాతి సంపదను తెగ నరికి... సరిహద్దులు దాటించే బడా స్మగ్లర్లకు పని చేసే వ్యక్తిని కూలీ అని ఎలా అంటారు? అంతదాకా ఎందుకు.. సినిమా విడుదల కాకముందే పైరసీ సీడీలు వస్తాయి. వాటిని ఎవరో తయారుచేస్తారు. మరెవరో సప్లై చేస్తారు. చివరకు వాటిని అమ్మే బక్కజీవి తాట తీయటమే కాదు.. వారి మీద భారీ కేసులు పెట్టి.. వారి బతుకులు ఆగమాగం చేస్తారు.

పైరసీ సీడీలు అమ్మేవాడు నేరస్తుడు అయినప్పుడు.. ఎర్రచందనం చెట్లను అడ్డంగా నరికేసి దుంగల్ని ఆడవులను దాటించే వ్యక్తిని ఎర్రచందనం కూలీ అని ఎందుకు అంటారు? తాను చేస్తున్న పని వెధవ పని అని.. పోలీసులకు కానీ దొరికితే కేసులు పెట్టి.. జైళ్లల్లో పడేస్తారని.. కోర్టుల చుట్టూ తిప్పుతారన్న విషయం స్పష్టంగా తెలిసి కూడా వారు ఎందుకీ దుర్మార్గానికి పాల్పడతారు? అలా తప్పులు చేసే వారిని కూలీ అని ముద్ర వేస్తే.. నిజాయితీగా పని చేస్తూ.. కష్టపడి పని చేసే కూలీని ఇంకేం అనాలి?

చట్టబద్ధంగా పని చేసి బతికే వ్యక్తిని కూలీ అని.. చట్టాన్ని ధిక్కరిస్తూ.. జాతి సంపదను నాశనం చేసే వారిని కూలీ అంటే..? నిజమైన కూలీకి ఎంత అవమానం? ఈ చిన్నపాటి విషయాన్ని పెద్ద పెద్ద నేతలు మొదలుకొని.. మీడియా సంస్థలు కూడా ఎర్రచందనం దుంగల్ని కోసుకెళ్లే వారిని కూలీలుగా పేర్కొనటంలో పరమార్థం ఏమిటో వారికే అర్థం కావాలి.

ఏర్రచందనం చెట్లను నరికే వారు కేవలం చెట్లను మాత్రమే నరకరు. అడ్డు వచ్చిన పోలీసుల్ని.. అధికారుల్ని సైతం మట్టుపెట్టేందుకు సైతం వెనుకాడరు. అలాంటప్పుడు వారిని కూలీలుగా అభివర్ణిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు. పేదరికం.. చదువుకోని విషయాల్ని చూపించి సానుభూతి సంపాదించే ప్రయత్నంచేస్తున్న వారు.. ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా తరలించినప్పుడు వచ్చే మొత్తంతో చేసే జల్సాల్ని ఏర్రకూలీ ఆనందంగా భావించాలా?

ఏళ్లకు ఏళ్లుగా శేషాచల అడవుల్లో తిష్ట వేసి.. ఇష్టారాజ్యంగా ఎర్రచందనం చెట్లను నరికి వేయటమే కాదు.. అడవుల్లో నిప్పు పెట్టే దారుణానికి ఒడిగట్టటం.. తమ అనైతిక కార్యకలాపాలను అడ్డుకునే అధికారుల ప్రాణాల్ని తీసేందుకు సైతం వెనుకాడని దుర్మార్గుల్ని ఎర్ర కూలీ అని ఎలా పిలుస్తారు? ఇలా పిలిచిన వారిని.. వారిని వెనకేసుకు వచ్చే వారిని చట్టబద్ధంగా కేసులు పెట్టేసి జైల్లో పడేయాల్సిన అవసరం చాలానే ఉంది.

లేకుంటే.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అండగా నిలిచిన వారిని ఈ రోజు రాజకీయ నాయకులు ఎర్రకూలీలు అంటే.. రేపొద్దున్న ఎర్రచందనం స్మగ్లర్లను.. అంతర్జాతీయ వ్యాపారులుగా అభివర్ణించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. అందుకే.. ఎర్రకూలీ అన్నోడిని అసలేమాత్రం ఉపేక్షించకూడదు.