Begin typing your search above and press return to search.

బాబు ఒక్క రెడ్డినీ గెలిపించుకోలేక‌పోయారే

By:  Tupaki Desk   |   24 May 2019 2:30 PM GMT
బాబు ఒక్క రెడ్డినీ గెలిపించుకోలేక‌పోయారే
X
37 ఏళ్ల సుధీర్ఘ చ‌రిత్ర క‌లిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత బ‌ల‌హీనంగా మారిపోయిన టీడీపీ ఇక‌పై ఎలా ప్ర‌స్థానం కొన‌సాగిస్తుందోన‌న్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. రాయ‌ల‌సీమ‌లో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ... స‌మీప భ‌విష్య‌త్తులో కోలుకొనే అవ‌కాశాలు ఎంత్ర‌మాత్రం క‌నిపించ‌డం లేదు. వైసీపీ ప్ర‌భంజ‌నం ముందు దాదాపుగా నాలుగు ద‌శాబ్ధాల ప్ర‌స్థానం క‌లిగిన టీడీపీ చిగురుటాకులా వ‌ణికిపోయింద‌నే చెప్పాలి. నిన్న‌టి ఫ‌లితాల నేప‌థ్యంలో టీడీపీ భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతోంద‌న్న విశ్లేష‌ణ‌లు అప్పుడే మొద‌లైపోయాయి.

స‌రే... ప్ర‌స్థానం మాట అటుంచితే... అస‌లు ఇప్పుడు టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన 23 మంది ఎమ్మెల్యేల్లో తెలుగు నేల‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి అస‌లు ప్రాతినిధ్య‌మే లేక‌పోవ‌డం ఇప్పుడు నిజంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌తో పాటు ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల రాజ‌కీయాల‌ను రెడ్డి సామాజిక వ‌ర్గం శాసిస్తున్న సంగ‌తి తెలిసిందే. గుంటూరు జిల్లాలోనూ రెడ్లు ఓ మోస్త‌రుగానే ఉన్నా... రాజ‌కీయంగా మాత్రం బ‌లంగానే ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంటే... మొత్తంగా ఆరు జిల్లాలు, ఓ జిల్లాలోని కొంత భాగానికి చెందిన రాజ‌కీయం రెడ్ల చేతిలోనే ఉన్నా... ఈ జిల్లాల్లో టీడీపీ ఒక‌టి అరా స్థానాలు సాధించినా... ఆ స్థానాల్లో గెలిచిన వారిలో ఒక్కరంటే ఒక్క‌రు కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు లేక‌పోవ‌డం నిజంగ‌నే ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యమే.

కోస్తాంధ్ర‌, ఉత్త‌రాంధ్ర‌ల్లో క‌మ్మ, కాపులు ఎలాగైతే రాజ‌కీయాల‌ను శాసిస్తున్నారో - రాయ‌ల‌సీమ జిల్లాల్లో రెడ్లు అదే స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఈ జిల్లాల్లో రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను మిన‌హాయిస్తే... ఏ పార్టీ అయినా అన్ని స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాలా ధైర్యంగా చాలా చోట్ల రెడ్డి సామాజిక వ‌ర్గానికి కాకుండా ఇత‌రుల‌కు టికెట్లు కేటాయించారు. ఇలా ఇత‌ర వ‌ర్గాల‌కు ఇచ్చిన సీట్ల‌లోనూ వారిని జ‌గ‌న్ గెలిపించుకున్నారు.

అయితే అందుకు విరుద్ధంగా దాదాపుగా మెజారిటీ స్థానాల‌ను రెడ్డి సామాజిక వ‌ర్గానికే కేటాయించిన చంద్ర‌బాబు మాత్రం ఒక్క‌రంటే ఒక్క రెడ్డిని కూడా గెలిపించుకోలేక‌పోయారు. పార్టీలు ఫిరాయించి వ‌చ్చిన రెడ్డి నేత‌ల‌ను కూడా చంద్ర‌బాబు గెలిపించుకోలేక‌పోయారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి చూస్తుంటే... భ‌విష్య‌త్తులో రెడ్డి సామాజిక వ‌ర్గం టీడీపీలో క‌నిపించ‌దేమోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీడీపీ గెలిచిన సీట్ల‌లోనూ మెజారిటీ సీట్ల‌లో చంద్ర‌బాబు సొంతం సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లే క‌నిపించ‌డం కూడా ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిపోయింది. అతి త‌క్కువ సీట్లు గెలిచిన టీడీపీ... ప‌లు సామాజిక వ‌ర్గాల‌కు అస‌లు టీడీపీ త‌ర‌ఫున చ‌ట్ట‌స‌భ‌లో ప్రాతినిధ్యం లేకుండానే చేసింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.