Begin typing your search above and press return to search.

రెడ్లు హ‌ర్ట్ అవుతున్నారు కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:30 PM GMT
రెడ్లు హ‌ర్ట్ అవుతున్నారు కేసీఆర్‌!
X
కొద్దిరోజులుగా కులాల మీద ఓపెన్ గా చ‌ర్చ జ‌ర‌గ‌టం ఎక్కువ అవుతోంది. నిజానికి కులాల‌కు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నా.. అందుకు భిన్నంగా కులాల లోతుల్లోకి వెళ్లి మ‌రీ మాట్లాడుకోవ‌టం.. రాజ‌కీయం మొత్తం దాని చుట్టూ తిర‌గ‌టం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. కులాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌ని తెలంగాణ రాష్ట్రంలో కులాల అవ‌గాహ‌న పెర‌గ‌ట‌మే కాదు.. రాజ‌కీయం మొత్తం దాని చుట్టూనే తిర‌గ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం.

ప‌రిచ‌య‌మైన ప‌ది నిమిషాల్లోనే మీ కులం ఏమిటంటూ అడిగేసే చిత్ర‌మైన తీరు కోస్తా ఆంధ్ర‌లో క‌నిపిస్తుంది. విషాదం ఏమిటంటే.. ఇప్పుడిప్పుడు అలాంటి ధోర‌ణి తెలంగాణ‌లోనూ క‌నిపిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. గ‌తంలో కులాల చుట్టూ రాజ‌కీయంగా జ‌రిగినా అదంతా తెర వెనుకే జ‌రిగేది. కానీ.. ఇప్పుడు ఓపెన్ గానే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఎక్క‌డిదాకానో ఎందుకు ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని ఉదంతాల్ని చూస్తే కులాల మీద తెలంగాణ‌లో మారిన ట్రెండ్ క‌నిపిస్తుంది. తెలంగాణ‌లో రాజ‌కీయంగా బ‌ల‌మైన వ‌ర్గంగా భావించే రెడ్డి వ‌ర్గాన్ని అణ‌గ‌దొక్కేందుకు తెలంగాణ అధికార ప‌క్షం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంద‌న్న ఆరోప‌ణ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. రెడ్ల‌ను రాజ‌కీయంగా నిర్వీర్యం చేయాల‌న్న త‌లంపు అధికార‌పార్టీలో ఉన్న‌ట్లుగా చెబుతారు. దానికి సాక్ష్యాలు ఇవి అని చూపించ‌కున్నా.. టీఆర్ఎస్ స‌ర్కారులో రెడ్ల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త అంతంత మాత్రంగానే చెబుతారు.

త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌ముఖులు ప‌లువురు త‌మ ఇంట జ‌రిగే వేడుక‌కు రావాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కోర‌టం మామూలే. సెలెక్టివ్ గా మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్లే కేసీఆర్‌.. ఈ మ‌ధ్య‌న అనంత‌పురం జిల్లాకు చెందిన కీల‌క నేత‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఇల‌వేల్పుగా భావించే ప‌రిటాల ర‌వి ఇంట్లో జ‌రిగిన ప‌రిటాల శ్రీరామ్ పెళ్లికి హెలికాఫ్ట‌ర్ వేసుకొని.. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుల్ని తీసుకెళ్ల‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

పెళ్లికి వెళ్లి.. నాలుగు అక్షింత‌లు వేసి.. కొత్త జంట‌ను ఆశీర్వ‌దించి వ‌స్తే స‌రిపోయేది. కానీ.. అలా చేయ‌కుండా అక్క‌డే ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌య్యావుల కేశ‌వ్‌ను ప్ర‌త్యేకంగా పిలిపించుకొని మాట్లాడ‌ట‌మే కాదు.. హెలికాఫ్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఏసీ బ‌స్సులో త‌న ప‌క్క సీట్లో కూర్చొబెట్టుకున్నారు. అక్క‌డితో ఆగ‌ని కేసీఆర్‌.. హెలికాఫ్ట‌ర్ లో ఎక్కే ముందు అంత‌మంది ముందు ప‌య్యావుల్ని ప్ర‌త్యేకంగా ప‌క్క‌కు తీసుకెళ్లి మ‌రీ మంత‌నాలు ఆడిన వైనం.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం కాలిపోయేలా చేసింది. హ‌ద్దులు దాటొద్ద‌ని.. అత్యాత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించొద్దంటూ చంద్ర‌బాబే స్వ‌యంగా క్లాస్ పీకే వ‌ర‌కూ విష‌యం వెళ్లింది.

ఇదంతా ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా.. ఆర్థికంగా బ‌లంగా ఉండే క‌మ్మ‌ల్ని ఆక‌ర్షించేందుకేన‌న్న రాజ‌కీయ విశ్లేష‌ణ ఒక‌టి ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ ప్ర‌చారంలో నిజం ఉంద‌న్న విష‌యాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక మీడియా అధిప‌తి త‌న విశ్లేష‌ణ‌లో సైతం ఓకే చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అంతేనా.. వెల్‌కం గ్రూప్ తో తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని రీతిలో త‌న జ‌ర్నీని కంటిన్యూ చేయాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ వెల్ కం గ్రూప్ అంటే ఏమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. వెల‌మ‌లు.. క‌మ్మ‌ల్ని క‌లిపేస్తే వ‌చ్చేదే వెల్‌కం గ్రూప్‌. మరి.. ఇంత జ‌రుగుతున్న‌ప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయంగా బ‌ల‌మైన వ‌ర్గంగా భావించే రెడ్ల‌కు ఆగ్ర‌హం క‌ల‌గ‌టంలో త‌ప్పేముంది? తానెంత ప్ర‌య‌త్నించినా రెడ్ల తన‌ను అభిమానించే ఛాన్స్ లేద‌ని కేసీఆర్ ఫిక్స్ కావ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి.

రెడ్ల‌కు ప్ర‌త్యామ్నాయాన్ని ఎంచుకున్న కేసీఆర్ తీరు రెడ్ల‌ను ర‌గిలిపోయేలా చేస్తోంది. ఇంత‌కాలం రాజ‌కీయంగా ఎదురులేని త‌మ‌కు.. ప్రస్తుత ప‌రిస్థితే మ‌రికొంత‌కాలం గ‌డిస్తే.. రానున్న రోజుల్లో త‌మ ఉనికికే ప్ర‌మాదక‌రంగా మారుతుంద‌న్న భావ‌న ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు భారీగా ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రెడ్ల సామాజిక వ‌ర్గానికి ఉన్న స‌మ‌స్య‌ల‌ప‌రిష్కారం కోసం భారీ ఎత్తున జ‌మ అయి.. త‌మ డిమాండ్ల‌ను తెర మీద‌కు తెచ్చేందుకు.. ప్ర‌భుత్వం మీద ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేశారు.వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌టం.. నిరుపేద రెడ్డి కుల‌స్తుల‌కు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌న్న డిమాండ్ల‌తో రెడ్డిపోరు యాత్ర‌ను త‌ల‌పెట్టారు. ఇలాంటి వేళ‌.. స‌మ‌యోచితంగా వ్య‌వ‌హ‌రించి.. సంయ‌మ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన పోలీసులు అత్యుత్సాహాన్ని ప‌ద‌ర్శించారు. రెడ్డి పోరు యాత్ర‌ను అడ్డుకునేందుకు లాఠీల‌ను ఝుళిపించారు.

శాంతియుతంగా త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్న త‌మ‌పై ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న‌ది రెడ్ల ఆవేద‌న‌. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తాము కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌లేద‌ని.. త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చేలా చేసిన చిన్న ప్ర‌య‌త్నాన్ని లాఠీల‌తో.. బ‌ల‌ప్ర‌యోగంతో అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేస్తారా? అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌మ‌ను కేసీఆర్ స‌ర్కారు ప‌క్క‌న పెడుతోంద‌న్న ఫీలింగ్ తో ఉన్న రెడ్లు మ‌రింత ఫీల‌య్యేలా తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. తీవ్ర స్థాయిలో హ‌ర్ట్ అయిన రెడ్ల‌ను కేసీఆర్ అలానే వ‌దిలేస్తారా? లేక వారిని కూల్ చేసేలా ఏదైనా ప్లాన్ చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.