Begin typing your search above and press return to search.

ట్ర‌క్కు దెబ్బ‌!.. కారు కు రీడిజైన్!

By:  Tupaki Desk   |   8 Feb 2019 10:20 AM GMT
ట్ర‌క్కు దెబ్బ‌!.. కారు కు రీడిజైన్!
X
ఇటీవ‌లే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించింది. ఎంత ధీమాగా ఎన్నిక‌ల‌కు వెళ్లారో... అంతే ధీమాగా విజ‌యం సాధించి రెండో ప‌ర్యాయం కూడా సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్‌... అస‌లు ఎన్నిక‌ల్లో తాను ఊహించిన 100 సీట్ల‌కు పైగా మెజారిటీ ఎందుకు రాలేద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు చేశారు. ఊహించిన మేర సీట్లు రాని వైనానికి గ‌ల కార‌ణాల‌ను కూడా తెలుసుకున్నారు. ఇంకేముంది న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను షురూ చేసేశారు. అందులో భాగంగా గులాబీ పార్టీ టీఆర్ ఎస్ సింబ‌ల్ అయిన కారు గుర్తుకు రీడిజైన్ జ‌రిగిపోతోంది. ఈ మేర‌కు టీఆర్ ఎస్ అభ్య‌ర్థ‌న‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘం సానుకూల స్పంద‌న‌, కారుకు రీడిజైనింగ్ చేసిన ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే రీడిజైన్ చేసిన కారు గుర్తు ఇక‌పై టీఆర్ ఎస్ ఎన్నిక‌ల గుర్తుగా అమ‌ల్లోకి రాబోతోంది.

కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో తొలి సీఎంగా అధికార పగ్గాలు చేప‌ట్టిన కేసీఆర్‌... త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తి కాకుండానే... ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త పెద్ద ఎత్తున ఉంద‌న్న కార‌ణంగానే టీఆర్ ఎస్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లింద‌ని విప‌క్షాల‌న్నీ క‌ట్ట క‌ట్టుకుని గ‌గ్గోలు పెట్టినా...అదేమీ లేద‌ని చెబుతూనే ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాల‌తో విప‌క్షాల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఒకే ద‌ఫా వంద‌కు పైగా స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసిన కేసీఆర్‌... ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ వంద‌కు పైగా సీట్ల‌ను సాధిస్తుంద‌ని, విప‌క్షాల‌కు సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావ‌డం క‌ష్ట‌మేన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత టీఆర్ ఎస్‌ కు గ‌తంలో వ‌చ్చిన సీట్ల కంటే ఓ 20 సీట్లు అద‌నంగానే వ‌చ్చినా.... తాను ఊహించినన్ని సీట్లు ఎందుకు రాలేద‌న్న విష‌యంపై కేసీఆర్ స‌మ‌గ్ర విశ్లేష‌ణ‌లు చేశారు. ఈ విశ్లేష‌ణ‌ల్లో కారు గుర్తును పోలిక ట్ర‌క్కు గుర్తే ఇందుకు కార‌ణ‌మ‌ని గుర్తించారు. ఈవీఎంల‌పై ముద్రించిన గుర్తుల్లో కారుతో పాటు ట్ర‌క్కు కూడా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు గుర్తులు దాదాపుగా ఒకేలా ఉండ‌టంతో చాలా మంది ఓట‌ర్లు కారు గుర్తు అనుకుని ట్ర‌క్కు గుర్తుకు ఓటేశారు. వాస్త‌వంగా ఇలాంటి ఓట‌ర్లంతా కారుకే ఓటేసేందుకు పోలింగ్ బూత్ ల‌కు వ‌చ్చినా... కారును పోలిన ట్ర‌క్కు కూడా ఉండ‌టంతో ట్ర‌క్కుకే వేసేశారు.

ఇదే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న చేసిన కేసీఆర్‌... కారు గుర్తును మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపించేలా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు రంగంలోకి దిగారు. అదే స‌మ‌యంలో కారు గుర్తును పోలిన ట్రక్కు లాంటి గుర్తుల‌తో ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కొంత‌మేర న‌ష్ట‌పోయింద‌ని, ఈ న‌ష్టం భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌కుండా తాము కారు గుర్తును స్ప‌ష్టంగా క‌నిపించేలా రీడిజైన్ చేస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి అభ్య‌ర్థ‌న పంపారు. దీనికి ఈసీ కూడా స‌రేన‌న‌డంతో ఇప్పుడు సింబ‌ల్ లో కారు స్ప‌ష్టంగా క‌నిపించేలా దానికి కొంత‌మేర రీడిజైన్ చేసి దానిని ఈసీకి పంపారు. ఈ రీడిజైనింగ్ లో కారు గుర్తు అంచుల‌ను కాస్తంత మందంగా, ఇత‌ర వాహ‌నాల గుర్తులు ప‌క్క‌నున్నా కూడా ఇట్టే స్ప‌ష్టంగా క‌నిపించేలా గుర్తుకు మాడిఫికేష‌న్ చేశారు. ఈ మాడిఫికేష‌న్ చేసిన కారు గుర్తును ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘానికి అంద‌జేసిన‌ట్లు ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. సో... త్వ‌ర‌లోనే లైనింగ్ లో మ‌రింత ద‌ళ‌స‌రిగా ఉండే గీత‌ల‌తో క‌నిపించే కారు గుర్తు త్వ‌ర‌లోనే ఈవీఎంల‌పైకి చేరుతుంద‌న్న మాట‌.