Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ల మాదిరిగా వీటి ధ‌ర‌లూ త‌గ్గించు జ‌గ‌న‌న్నా..!!

By:  Tupaki Desk   |   5 Jan 2022 11:53 AM GMT
సినిమా టికెట్ల మాదిరిగా వీటి ధ‌ర‌లూ త‌గ్గించు జ‌గ‌న‌న్నా..!!
X
రాష్ట్రంలో పేద‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. రూ.100కు అమ్మాల్సిన సినిమా టికెట్‌ను రూ.150, రూ.200ల కు పెంచ‌డం వ‌ల్ల వారు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నార‌ని పేర్కొంటూ.. ప్ర‌భుత్వం సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. స‌రే.. దీనిపై వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇదిలావుంటే.. ప్ర‌జ‌లు ఎవ‌రూ కోర‌కుండానే సినిమా టికెట్ల భారాన్ని త‌గ్గించేందుకు న‌డుంబిగించిన ఏపీ స‌ర్కారుకు ఇప్పుడు అదే ప్ర‌జ‌ల నుంచి ఒక కీల‌క విజ్ఞ‌ప్తి తెర‌మీదికి వ‌చ్చింది. అదేంటంటే..చిన్న‌పాటి ఇల్లు కట్టుకుంటాం..దీనికి సంబంధించిన మెటీరియల్ కాస్ట్ ఆకాశంలో ఉంది. సో.. వీటి ధ‌ర‌లు కూడా త‌గ్గించి పుణ్యం క‌ట్టుకో.. జ‌గ‌న‌న్నా! అని వారు విన్న‌విస్తున్నారు.

రాష్ట్రంలో మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఇల్లు కొనాల‌న్నా.. ఉన్న స్థ‌లంలో ఇల్లు క‌ట్టాల‌న్నా.. ధ‌ర‌లు వాచిపోతు న్నాయి. ఇసుక‌, సిమెంటు, ఐర‌న్‌, కంక‌ర వంటివి లేకుండా ఇల్లు క‌ట్టేప‌రిస్థితి లేదుక‌దా! కానీ, ఆ స‌రుకుల ధ‌ర‌లే ఆకాశాన్ని అంటుతున్నాయి. సిమెంటును తీసుకుంటే ఒక్కో సిమెంట్ బ్యాగ్‌పై రూ.30 వరకు ధరలు పెంచినట్టు కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధరలు బుధ‌వారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో నేటి నుంచి సిమెంట్ ఖరీదైనదిగా మారుతోంది. సిమెంట్ ధరలు పెంచగానే.. ఆయా కంపెనీల షేర్లు ధరలు కూడా పైకి జంప్ చేశాయి.

ఇండియా సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఎన్‌సీఎల్ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు ధరలు పెంపును ప్రకటించాయి. పెరిగిన ధరలతో నేటి ట్రేడింగ్‌లో సిమెంట్ కంపెనీల షేర్లు కూడా 4 శాతం వరకు ఎగిశాయి. సిమెంట్ ధరలు పెంపుపై రియల్ ఎస్టేట్ బిల్డర్స్ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ఆందోళన వ్యక్తం చేసింది. సిమెంట్, స్టీల్ వంటి ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ వ్యయాలు భారీగా పెరుగుతున్నాయని క్రెడాయ్ తెలిపింది.

దీంతో ఇల్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ముడి సరుకుల ధరల పెరగడాన్ని నియంత్రించాలని క్రెడాయ్ ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీని తగ్గించాలని అభ్యర్థించింది. అదేస‌మ‌యంలో చిరుద్యోగులు, వేత‌న జీవులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇసుక‌ను అందుబాటు ధ‌ర‌లోకి తీసుకురావాల‌ని.. ఐర‌న్‌, సిమెంటు ధ‌ర‌లను కూడా త‌గ్గించాల‌ని కూడా విన్న‌విస్తున్నారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందోచూడాలి.