Begin typing your search above and press return to search.

'రీల్ కాదు రియల్' అంటూ పీకేను ఇంతలా మరెవరూ వాడలేదు బాస్

By:  Tupaki Desk   |   20 Jan 2023 5:24 AM GMT
రీల్ కాదు రియల్ అంటూ పీకేను ఇంతలా మరెవరూ వాడలేదు బాస్
X
ఇమేజ్ ను పెంచుకోవటానికి సోషల్ మీడియాలో ప్రముఖులు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అదే సమయంలో తాము అభిమానించే తమ నాయకుడ్ని సరికొత్తగా చూపించటానికి.. సినిమాటిక్ ఇమేజ్ తో వారిని మరింత హైప్ చేయటానికి చేస్తున్న క్రియేటివ్ ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అందులో ఎఫెక్టు ఎక్కువగా చూపించే వీడియోలు మరింత ప్రభావాన్ని చూపిస్తుంటాయి. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వరుస పెట్టి ఒప్పందాలు చేసుకోవటం.. తన పీఆర్ టీంతో వాటికి సంబంధించిన వివరాల్ని ప్రయారిటీ బేసిస్ లో పంపటం తెలిసిందే.

దీంతో.. ఈసారి దావోస్ లో మంత్రి కేటీఆర్ సాధించిన పెట్టుబడులు అందరిని ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పనితీరుతో ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పని తీరును లెక్కిస్తూ మండిపడుతున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి దావోస్ ఆహ్వానం అందలేదని.. అందుకే వారు వెళ్లలేదన్న ప్రచారం మొదలైంది. అంతకంతకూ పెరుగుతున్న ఈ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన మంత్రి గుడివాడ.. తమకు దావోస్ ఆహ్వానం లభించిందని.. త్వరలో తాము పెట్టుబడుల సదస్సును విశాఖలో నిర్వహించనున్నామని.. ఆ ఏర్పాట్ల కోసమే తాము దావోస్ వెళ్లలేదంటూ చెప్పుకొచ్చారు.

అయితే.. ఆయన మాటలు అతికేలా లేవన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆయన పని తీరు.. దావోస్ లో జరుగుతున్న సదస్సు కోసం పరాయి దేశం వెళ్లి.. తన టీంతో ఆయన చేస్తున్న ప్రయత్నాలు.. వాటికి సంబంధించిన క్లిప్పింగ్ తో.. అత్తారింటికి దారేది మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంట్రీ సాంగ్ 'అరు అడుగుల బుల్లెట్' పాటలోని కొంత భాగాన్ని వాడేసి.. అందుకు తగిన సీన్లను యాడ్ చేసి తయారు చేసిన వీడియో వైరల్ గా మారింది.

నిమిషం కంటే తక్కువగా ఉన్న ఈ వీడియోను చూస్తే.. సీన్ ను రెండుగా చేసి పై భాగంలో రీల్ లో పవన్ కల్యాణ్ పాటను ప్రదర్శిస్తూ.. దాని కింది భాగంలో కేటీఆర్ పని తీరు ఆ పాట స్థాయిలో ఉందన్న విషయాన్ని తెలిసేలా డిజైన్ చేశారు. ఆ సీన్లు నడుస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో 'గగనపు వీధి వీధి వలస పోయిన నీలిమబ్బు కోసం తరలిపోయింది ఆకాశం..పరదేశం.

శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచి చూసింది' అంటూ పాటను మిక్స్ చేశారు. ఆశ్చర్యకరంగా రీల్ కు ఏ మాత్రం తగ్గనంత హీరోయిజాన్ని తాజా వీడియోలో కేటీఆర్ కు చూపటం అందరిని ఆకర్షిస్తోంది.

''రీల్ కాదు రియల్'' పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే దావోస్ సదస్సుకు వెళ్లకపోవటంపై తలబొప్పి కట్టిన వేళ.. ఒక పవర్ ఫుల్ పాటతో కేటీఆర్ రియల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలామారిన ఈ చిట్టి వీడియో తెగ ఇబ్బంది పెట్టేయటం ఖాయమని చెప్పాలి. మరోవైపు.. ఈ వీడియోను చూసిన టీఆర్ఎస్ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. ఏమైనా.. పవన్ ను ఇంతలా వాడేసిన వీడియో ఇటీవల కాలంలో మరొకటి లేదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.