Begin typing your search above and press return to search.

ఛానెళ్ల పిచ్చి!... పీక్స్‌ కు వెళ్లిన‌ట్టే!

By:  Tupaki Desk   |   27 Feb 2019 1:58 PM GMT
ఛానెళ్ల పిచ్చి!... పీక్స్‌ కు వెళ్లిన‌ట్టే!
X
ఏ వార్త చెప్పాలంటే... ఆ వార్త‌కు త‌గ్గ డ్రెస్ కోడ్ లో క‌నిపించాల్సిందే. మొన్నామ‌ధ్య బాలీవుడ్ హీరోయిన్ శ్రీ‌దేవి చ‌నిపోతే... ఆమె మ‌ర‌ణం ఎలా సంభ‌వించింద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ఓ టీవీ ఛానెల్ ఏకంగా బాత్ రూం సెట్టేసి - త‌న యాంక‌ర్‌ను బాత్ ట‌బ్‌ లో ప‌డుకోబెట్టేసి వార్త‌లు చెప్పించింది క‌దా. గుర్తుందా? ఆ ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విరుచుకుప‌డ్డ విష‌యం తెలిసిందే. పిచ్చి పీక్స్ కు వెళ్ల‌డ‌మంటే ఇదేనంటూ నెటిజ‌న్లు సంధించిన సెటైర్ల‌ను స‌ద‌రు టీవీ ఛానెల్ అస్స‌లంటే అస్స‌లు ప‌ట్టించుకోకపోగా... దానిని చాలా లైట్‌గానే తీసుకుని సాగిపోయింది. అదేదో నేష‌న‌ల్ న్యూస్ ఛానెల్ కాబ‌ట్టి స‌రిపోయింది గానీ... ప్రాంతీయ భాషా ఛానెల్ అయితే ప‌రిస్థితి ఎలా ఉండేదో.

ఆ ప‌రిస్థ‌తి ఎలా ఉండేద‌న్న విష‌యాన్ని ఇప్పుడు ఓ తెలుగు టీవీ ఛానెల్ చూపించేసింది. మొన్న పుల్వామా దాడి త‌ర్వాత నేరుగా ఆ ప్ర‌దేశానికి త‌న యాంకర్ల‌ను త‌ర‌లించేసిన ఒక రీజినల్ ఛానల్ ... అక్క‌డి నుంచే లైవ్ ప్ర‌సారాల‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఒక్క బుల్లెట్ శ‌బ్దం వినిపిస్తే... దానిని రోజంతా తిప్పితిప్పి ప్ర‌సారం చేసిన స‌దరు ఛానెల్ ఇప్పుడు భార‌త్‌ - పాకిస్థాన్‌ ల మ‌ధ్య దాదాపుగా మొద‌లైపోయిన యుద్ధానికి సంబంధించిన వార్త‌ల‌ను చెప్పేందుకు ఏకంగా త‌న యాంక‌ర్ల‌కు ఆర్మీ డ్రెస్సులేసేసింది. అంతేనా... వార్ జోన్ నుంచే వార్త‌లు అందిస్తున్నామని చెబుతూ... ఓ లేడీ యాంక‌ర్‌ కు ఆర్మీ డ్రెస్ వేయించ‌డంతోనే ఆగ‌కుండా... ఏకంగా ఆమె చేతిలో మెషీన్ గ‌న్‌ ను కూడా పెట్టేసింది.

త‌న యాజ‌మాన్యం చేస్తున్న ఈ త‌ర‌హా వింత తంతు స‌ద‌రు లేడీ యాంక‌ర్‌ కు బాగా న‌చ్చేసిందేమో తెలియ‌దు గానీ... ఆర్మీ డ్రెస్సు - చేతిలో క‌ల‌ష్నికోవ్‌ ను ప‌ట్టుకుని యుద్ధ భూమిలో సైనికులు నేల‌పై వాలి పాక్కుంటూ వెళుతున్న‌ట్లుగా... తాను కూడా నేల‌కు వాలిపోయింది. ఈ త‌ర‌హా రిపోర్టింగ్ వార్ న్యూస్‌ ను ఏ మేర క‌వ‌రేజ్ చేస్తుంద‌న్న దాని కంటే కూడా ఆర్మీ డ్రెస్సులేసుకుని ఈ రిపోర్టింగ్ ఏమిటంటూ చికాకు తెప్పించేస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ త‌ర‌హా రిపోర్టింగ్‌ పై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొద‌లు కాగా... ఇవేవీ త‌మ సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌ను నీరుగార్చ‌లేవంటూ రీజినల్ ఛానల్ అదే త‌ర‌హాను కొన‌సాగిస్తోంది.