Begin typing your search above and press return to search.

రూపాయికే రిజిస్ట్రేషన్.. ఏపీలో పేదలకు జగన్ ఆఫర్

By:  Tupaki Desk   |   18 Oct 2019 7:49 AM GMT
రూపాయికే రిజిస్ట్రేషన్.. ఏపీలో పేదలకు జగన్ ఆఫర్
X
ఏపీలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ పెట్టింది. పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాల దారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం రూపాయికే వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అయితే, ఇది రెండు సెంట్ల కంటే తక్కువ స్థలంలోని నిర్మాణాలకే వర్తిస్తుంది. అదేసమయంలో క్రమబద్ధీకరణ ఫీజు ఎంతనేది ఇంకా నిర్ణయించలేదు. రెండు సెంట్ల కంటే తక్కువ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ విషయంలో విధివిధానాలు తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

గతంలో పేదలకు గతంలో స్థలాలు ఇచ్చినా చాలాచోట్ల రిజిస్ట్రేషన్లు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం వాటికి రిజిస్ట్రేషన్లు చేయాలనుకుంటోంది. కొత్తగా ఇల్లు ఇచ్చే విషయంలో కూడా అగ్గిపెట్టెల్లాంటి ఫ్లాట్లు కాకుండా స్థలాలు కేటాయించి ఇండిపెండెంట్ ఇళ్లు కట్టివ్వడమే నయమని జగన్ అన్నారు. ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గాలేదని.. ఫలితంగా ఫ్లాట్లు దెబ్బతింటున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనికి పరిష్కారంగా లబ్ధిదారులకు విడివిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో పారదర్శకత పాటించాలని, ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని కూడా సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలని.. లక్ష్యం కన్నా మరో 10 శాతం అదనంగా ఇళ్ల స్థలాలను బఫర్‌గా పెట్టుకుంటే దరఖాస్తుదారులు అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బందిలేకుండా ఉంటుందని సీఎం అన్నారు. కాగా ఇప్పటికే అధికారులు చేసిన సర్వే ప్రకారం 20 లక్షల మందికిపైగా అర్హులను గుర్తించారు. సుమారు 20 వేల ఎకరాల భూమిని గుర్తించారు. మరో 8 వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందని అధికారులు సీఎంకు చెప్పారు.