Begin typing your search above and press return to search.

ఏపీలో రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆ జిల్లాలో మాత్రం అనూహ్యమట

By:  Tupaki Desk   |   8 Dec 2020 1:01 PM GMT
ఏపీలో రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆ జిల్లాలో మాత్రం అనూహ్యమట
X
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవటం.. వాటికి అవసరమైన చర్యలు తీసుకోవటంతోనే ఏపీ సర్కారుకు సరిపోతోంది. విపత్తులు.. ఆర్థిక సమస్యలు.. విపక్షం పన్నే కుయుక్తులు.. వెరసి అనుక్షణం ఏదో ఒక విష ప్రచారాన్ని ఎదుర్కొంటూ పాలన సాగిస్తున్నారు. ఇలాంటివేళ.. కరోనా మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. దీంతో.. పలు అంశాల మీద ప్రభావాన్ని చూపుతోంది.

తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2019-20తో పోల్చినప్పుడు భారీ తగ్గుదల నమోదు కావటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో నవంబరు వరకు 11,50,582 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. వీటి విలువ రూ.3,312.95 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య 10,12,150కు పరిమితమైన పరిస్థితి. తగ్గిన రిజిస్ట్రేషన్లకు తగ్గట్లే.. ఆదాయం కూడా తగ్గింది.

గత ఏడాదితో పోలిస్తే.. దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లుగా చెప్పాలి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. క్రిష్ణ.. గుంటూరు.. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుఅనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. కర్నూలు జిల్లాలో స్వల్పంగా పెరిగితే.. అనూహ్యంగా విజయనగరం జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగటం గమనార్హం.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఉక్కునగరానికి దగ్గర్లో ఉండే విజయనగరం మీద ప్రభావం కనిపిస్తోంది. అక్కడి భూముల అమ్మకాలు..కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో.. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ నవంబరు నాటికి 14 శాతం పెరుగుదల నమోదు కావటం విశేషం. రాష్ట్రం మొత్తంగా 12 శాతం తగ్గుదల నమోదైతే.. విజయనగరం జిల్లాలో మాత్రం 14 శాతం పెరుగుదల నమోదైంది. 2019లో విజయనగరంలో 44,858 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది నవంబరు నాటికి 51,105 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిన జిల్లాల్లో మొదటి స్థానం అనంతపురమైతే.. రెండోస్థానంలో గుంటూరు నిలిచింది. తర్వాతి స్థానంలో క్రిష్ణా జిల్లా నిలిచినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.