Begin typing your search above and press return to search.

బంధువుల పోటీ.. ఎవరిని గెలిపించాలి?

By:  Tupaki Desk   |   24 March 2019 8:51 AM GMT
బంధువుల పోటీ.. ఎవరిని గెలిపించాలి?
X
ఫ్యాక్షనిజం అత్యధికంగా ఉన్న కర్నూలు జిల్లాలో రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. ఈ జిల్లాలో ఎక్కువగా బంధువుల మధ్యే పోటీ ఉండడంతో వారి అనుచరులంతా ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఒకరికి ఓటే వేస్తే మరొకరికి బాధ అన్నట్లుగా ఇక్కడ రాజకీయం సాగుతోంది. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏర్పడడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.

సాధారణంగా తమ బంధువు ఎన్నికల పోటీలో నిలబడితే ప్రచారం చేయడానికి వస్తారు. కానీ కర్నూలు జిల్లాలో ఎక్కువగా బంధువుల మధ్యే పోటీ ఉండడంతో ఏ స్థానంలో ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. దీంతో ఆ బంధువులకు దగ్గర ఉన్న నేతలంతా ఆందోళన చెందుతున్నారు.

కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ తరుపున భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. ఈయనకు పిల్లనిన్చిన మామ అయిన కాటసాని రామిరెడ్డి వైసీపీ తరుపున జనగానపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దని ఇదే బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌ రెడ్డి చంద్రబాబు వద్ద పట్టుబట్టారు.. ఒకవేళ బ్రహ్మానందరెడ్డికి టికెట్‌ ఇస్తే జనగానపల్లెలో వైసీపీలో ఉన్న మామ తరుపున ఎలా ప్రచారం చేస్తారని.. తనను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాడని పార్టీ అధినేతను ప్రశ్నించారట. సొంత అల్లుడు టీడీపీలో ఉండి వైసీపీలో ఉన్న మామను ఓడించడానికి తమ తరుపున ప్రచారం చేయగలడా..? అని బీసీ జనార్దన్‌రెడ్డి నిలదీశాడట.. .

ఇదిలా ఉండగా ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. ఆమె మేనమామ ఎస్వీ మోహన్‌ రెడ్డి కర్నూలు ఎంపీగా బరిలో ఉన్నారు. ఆయన ఎవరి తరుపున ప్రచారం చేస్తారనే ప్రశ్న ఉత్ఫన్నమవుతోంది. అంతేకాకుండా ఆయనకు కర్నూలు టికెట్‌ దక్కకపోవడంతో టీడీపీని ఓడించి తీరుతానని శపథం చేశాడని అంటున్నారు. ఆయన ప్రభావం కర్నూలు వరకే పరిమితం అవుతుందా..? లేక జిల్లాపై ప్రభావం చూపుతుందా..? అనేది చూడాలి. ఒకవేళ ఆయన ప్రభావం నంద్యాలపై పడితే అఖిలప్రియ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.