Begin typing your search above and press return to search.

యువతి దారుణ హత్యకు మతాన్ని అంటగట్టడం కరెక్టేనా?

By:  Tupaki Desk   |   21 Nov 2022 11:30 PM GMT
యువతి దారుణ హత్యకు మతాన్ని అంటగట్టడం కరెక్టేనా?
X
తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఓ యువకుడు ఢిల్లీలో 35 ముక్కలుగా నరికి చంపిన సంగతి తెలిసిందే. అయితే యువతి శ్రద్ధ వాకర్‌ హిందూ యువతి కావడం, యువకుడు అఫ్తాబ్‌ ముస్లిం కావడంతో ఇప్పడీ ఈ ఘటనకు కొంతమంది మతం రంగు పులమడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అఫ్తాబ్‌.. లవ్‌ జిహాద్‌లో భాగంగానే ఇలా చేశాడని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. తప్పుడు పనులు చేసేవాళ్లు, హత్యలు చేసేవాళ్లు, ఇంకా అనేక రకాల కిరాతకాలకు పాల్పడేవాళ్లు అన్ని మతాల్లో, కులాల్లోనూ ఉంటున్నారు. అలాగే ఇలాంటి ఘటనల్లో పురుషులను మాత్రమే తప్పు బట్టాల్సిన పనిలేదు. మహిళలేమీ తక్కువ తినడం లేదు.

భర్తలను చంపించే భార్యలు, స్వయంగా భార్యలు లేదా ప్రియురాళ్లే ప్రియుడిని చంపించిన ఘటనలు కూడా నిత్యం మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. సొంత కులం వాళ్లే తమ కులంలో వాళ్లనే, సొంత మతం వాళ్లే తమ మతానికి చెందినవారినే చంపుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.

కేవలం ఒక మతానికి చెందినవారు మాత్రమే హత్యలు చేస్తారని, తప్పుడు పనులు చేస్తారని విమర్శించడం, దీనికి మతం రంగు పులిమి సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌ యూనివర్సిటీలో ప్రచారం చేయడం సరికాదంటున్నారు.

తప్పు ఎవరు చేసినా తప్పేనని.. దానికి కులం రంగో, మతం రంగో పూయడం కరెక్ట్‌ కాదని అంటున్నారు. తప్పుడు పనులు చేసినవారిని అంతవరకే చూడాలని.. వారికి కఠిన శిక్షలు పడాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలా కాకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుతో ఫలానా కులం వాళ్లంతా అంతే.. లేదా ఫలానా మతం వాళ్లు అంతే అంటూ సొంత తీర్మానాలు చేసుకోవడం, ఆయా కులాలు, మతాలపై విద్వేషాలు వ్యాపింపజేయడం సరికాదని నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది.

తప్పును తప్పుగా ఖండించడం అనేది ప్రజల్లో రావాలని, తప్పు చేసినవాళ్లు ఏ మతం, ఏ కులం అనేది చూడటం సరికాదంటున్నారు. ఒక్కరు చేసిన తప్పుతో ఆ కులానికి చెందినవారిని, మతానికి చెందినవారిని తప్పుబట్టడం అస్సలు సరికాదని సూచిస్తున్నారు. అలాగే ఆయా మతాలపై, కులాలపై విద్వేష భావనలు కలిగేలా పోస్టులు పెట్టడం కూడా సరికాదని చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.