Begin typing your search above and press return to search.
2 వారాల్లో 100 పడకల ఆసుపత్రి...రిలయన్స్ అద్భుతం
By: Tupaki Desk | 25 March 2020 12:57 PM GMTకరోనా మహమ్మారి బారిన పడ్డ చైనా ఇప్పుడిపుడే కోలుకుంటోన్న సంగతి తెలిసిందే. కరోనా పిశాచి తీవ్రతను గ్రహించిన చైనా ప్రభుత్వం...ఆ వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే దానిని అరికట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. కరోనా బారిన పడ్డ వారికోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రినే నిర్మించింది. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1000 పడకల ఆసుపత్రిని కేవలం పది రోజుల్లో నిర్మించింది. కరోనా పుట్టిల్లయిన వుహాన్ లో ఈ ఆసుపత్రిని ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో చైనా సర్కార్ యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. భారత్ లోనూ కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వీలైనన్ని ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తెచ్చింది. కానీ, కరోనా తీవ్రతను ఎదుర్కొనేందుకు భారత్ లో కూడా ప్రత్యేకమైన ఐసోలేషన్ ఆసుపత్రుల అవసరముంది. ఈ నేపథ్యంల భారత్ లో మొట్టమొదటి కరోనా వైరస్ ఆసుపత్రిని ముంబైలో రిలయన్స్ సంస్థ నిర్మించింది. కోవిడ్ 19 బాధితుల కోసం ప్రత్యేకంగా 100 పడకలను రిలయన్స్ సిద్ధం చేసింది.
కరోనా కట్టడికి తనవంతు సాయం అందించేందుకు వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. కరోనాపై పోరాటంలో తన వంతు సాయంగా మాస్కుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని రోజుకు లక్షకు పెంచిన రిలయన్స్...కరోనా పాజిటివ్ పేషంట్లను తరలించేందుకు ఉపయోగించే వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేయనుంది. దీంతోపాటు, లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకు ఎన్జీవోలతో కలిసి ఉచితంగా ఆహారం అందిస్తామని ప్రకటించింది. వీటితోపాటు, బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సహకారంతో శ్రీ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 100 పడకల ఆసుపత్రిని రెండు వారాల్లో నిర్మించింది. వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు, డయాల్‌సిస్ మెషిన్లు, పేషెంట్ మానిటరింగ్ పరికరాలతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఓ నెగటివ్ రూమ్‌ను కూడా ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది.
దీంతోపాటు, తమ కంపెనీ తరఫున ప్రాజెక్ట్‌లలో పని చేసే కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులకు జీతాలను పూర్తిగా చెల్లిస్తామని రిలయన్స్ ప్రకటించింది. జియో పాత కస్టమర్లకు డేటా పరిమితిని పెంచడంతో పాటు...కొత్త బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు ఉచితంగా సర్వీసులను అందించనుంది.