Begin typing your search above and press return to search.

జంటనగరాల్లో జంట భవనాలు

By:  Tupaki Desk   |   16 July 2016 6:46 AM GMT
జంటనగరాల్లో జంట భవనాలు
X
తెలంగాణలో భారీ టవర్ల నిర్మాణం దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి. దుబాయి - మలేషియా టవర్ల తరహాలో వందల అడుగుల ఎత్తున్న జంట భవనాలను నిర్మించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తలపోస్తోంది. వాస్తవానికి దీనికి సమైక్య రాష్ట్రంలోనే బీజం పడినా ఆ తరువాత కాలంలో ఇది మరుగున పడిపోయింది. అప్పట్లో ‘రిలయన్స్ టవర్స్’ ప్రాజెక్టుగా పేర్కొన్న ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన.. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఏర్పడడం వంటి కారణాల వల్ల అప్పట్లో ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్టును తిరిగి చేపట్టడంపై పరిశ్రమలు - ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు శనివారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. రిలయన్సు ఇన్ ఫ్రా సంస్థకే ఈ ప్రాజెక్టు అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే... రాయితీలు - ప్రోత్సాహకాలు - మాఫీల విషయంలో చర్చలు జరపనున్నారు.

వంద అంతస్తుల్లో - 20 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ వాణిజ్య భవనం కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 76.2 ఎకరాలను తొలుత 2007లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. అంచనా వ్యయం రూ.7 వేల కోట్లతో నిర్మాణ బాధ్యతను రిలయన్స్ ఇన్‌ ఫ్రాకు అప్పగించింది. ప్రాజెక్టులో పర్యవేక్షణ సంస్థ టీఎస్‌ ఐఐసీకి 11 శాతం - రిలయన్స్ ఇన్‌ ఫ్రాకు 66 శాతం - సాంకేతిక భాగస్వామి శోభా డెవలపర్స్‌ కు 23 శాతం వాటాలున్నాయి. తన వంతు వాటాగా రిలయన్స్ ఇన్‌ ఫ్రా రూ.527 కోట్ల పెట్టుబడికి అంగీకరించగా.. డిబెంచర్లు - నగదు రూపంలో సుమారు సగం మొత్తాన్ని చెల్లించింది కూడా. కానీ.. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పరిణామాలు.. ఆర్థికమాంద్యం - రాష్ట్రంలో విభజన వంటి కారణాల వల్ల ప్రాజెక్టు ఆగిపోయింది.

అయితే.. విభజన తరువాత ఏర్పడిన టీఆరెస్ ప్రభుత్వం ఇప్పటికే కుదురుకోవడంతో ఇతర నగరాలు, ఇతర రాష్ట్రాలతో సమానంగా నిలిచేందుకు, ప్రత్యేకత చాటుకునేందుకు గాను ఇప్పుడీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం బ్రాండ్ హైదరాబాద్‌ ను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును తిరిగి చేపట్టేందుకు రిలయన్స్ ఇన్‌ ఫ్రా కూడా ఆసక్తి చూపుతోంది. అయితే తన వంతు వాటాలో కొంత పెట్టుబడితో పాటు, పెనాల్టీ మాఫీ చేయాలని ఆ సంస్థ ఇన్‌ ఫ్రా కోరుతోంది. మరోవైపు కన్సల్టెన్నీ సంస్థ ఎర్నెస్ట్ యంగ్ ఇచ్చిన ప్రాజెక్టు రీస్ట్రక్చరింగ్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. శనివారం దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సమీక్షించబోతున్నారు. ఈ ప్రాజెక్టు మొదలైతే జంట నగరాల్లో జంట టవర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నమాట.