Begin typing your search above and press return to search.

ఛాయిస్ లేకుండా చేస్తున్న జియో!

By:  Tupaki Desk   |   1 March 2018 3:39 AM GMT
ఛాయిస్ లేకుండా చేస్తున్న జియో!
X
వ్యాపార సంస్థ‌ల మ‌ధ్య పోటీ ఉండాలే కానీ.. ఒకరినొక‌రు చంపేసుకునేంత ఉండ‌కూడ‌దు. చంపేసుకోవ‌టం అంటే క‌త్తుల‌తో పొడిచేసుకొని హ‌త్య‌లు కాదు.. కంపెనీల ఉనికి అన్న‌ది లేకుండా చేసుకోవ‌టం అన్న‌ది ఇక్క‌డ అర్థం. వ్యాపారంలో పోటీ ఉండాలి. కానీ.. అది ఆరోగ్య‌క‌ర‌మైన పోటీనే ఉండాలి. లేకుంటే మొద‌ట్లో వినియోగ‌దారుల‌కు లాభం చేకూరినా.. అంతిమంగా న‌ష్టమే జ‌రుగుతుంది. తాజాగా ముకేశ్ అంబానీ జియో కార‌ణంగా ఇలాంటిదే జ‌ర‌గ‌నుంది.

కారుచౌక‌గా డేటా ఛార్జీల‌తో పాటు.. ఎనీవేర్ ఇండియా అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రీ అని చెబుతూ.. జీబీల‌.. బీజీల డేటాను అత్యంత త‌క్కువ ధ‌ర‌కు అందిస్తున్న దెబ్బ‌కు మిగిలిన ఆప‌రేట‌ర్లు కుదేలు అవుతున్నారు.

ఇప్ప‌టికే టెలికం రంగంలో ఉన్న కంపెనీలు త‌క్కువ అయిపోయాయి. జియో పుణ్య‌మా అని ఉన్న కంపెనీలు మ‌రింత‌గా త‌గ్గిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. తాజాగా ఎయిర్ సెల్ దివాలా పిటిష‌న్ దాఖ‌లు చేయ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో మూడు నాలుగు కంపెనీలు మిన‌హా.. మ‌రింకేమీ మిగిలేట‌ట్లు లేద‌ని చెబుతున్నారు.

జియో రావ‌టంతోనే సంచ‌ల‌నాత్మ‌క ఆఫ‌ర్ల‌ను తెర మీద‌కు తెచ్చింది. దీంతో.. టెలికాం ఆప‌రేట‌ర్ల మీద భారీ ఒత్తిడిని పెంచింది. జియోతో పోటీ ప‌డేందుకు కంపెనీలు కిందామీదా ప‌డ్డాయి. దీంతో.. వాటి ఆర్థిక ప‌రిస్థితి దెబ్బ‌తిన్నాయి. అప్పులు పెరిగాయి. ఇవి అంత‌కంత‌కూ పెరిగిపోతున్న నేప‌థ్యంలో చిన్న ఆప‌రేట‌ర్లు పెద్ద ఆప‌రేట‌ర్ల‌తో విలీనం అయ్యే ప‌రిస్థితి.

టెలినార్ త‌న భార‌త వ్యాపారాన్ని భార‌తీ ఎయిర్ టెల్‌కు అమ్మేందుకు ఓకే చెప్పేసింది. అదే స‌మ‌యంలో భార‌తీ ఎయిర్ టెల్ మ‌రో ప్ర‌ముఖ కంపెనీ అయిన టాటా టెలీస‌ర్వీసెస్‌కు చెందిన మొబైల్ వ్యాపారాన్ని కొనుగోలు చేయ‌నున్న‌ట్లుగా చెప్పింది. ఇక‌.. 2017లోముకేశ్ అంబానీ త‌న త‌మ్ముడైన అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ కు చెందిన స్పెక్ట్రమ్‌ - టవర్లు - ఓఎఫ్‌ సీ నెట్‌ వర్క్‌ - ఇతరత్రా వైర్‌ లెస్‌ ఆస్తులను కొనుగోలు చేశారు.

మ‌రోవైపు వోడాఫోన్.. ఐడియాలు క‌లిసిపోయే ప్ర‌క్రియ‌లో ఉండ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో మూడు నాలుగు పెద్ద పెద్ద కంపెనీలు మిన‌హా మిగిలిన టెలికాం ఆప‌రేట‌ర్లు అంత‌ర్థానం కానున్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ఆ మూడు.. నాలుగు కంపెనీలు ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా మారుతుంది. అదే జ‌రిగితే ఛాయిస్ త‌గ్గి.. ఉన్న మూడు.. నాలుగింటిలో ఏదో ఒక సేవ‌ను వినియోగించుకోవ‌టం మిన‌హా మ‌రో దారి ఉండ‌ని ప‌రిస్థితి నెల‌కొంటుంది.