Begin typing your search above and press return to search.

నమ్మలేని ఆఫర్: రూ.500లకు 600జీబీ డేటా

By:  Tupaki Desk   |   19 Nov 2016 7:11 AM GMT
నమ్మలేని ఆఫర్: రూ.500లకు 600జీబీ డేటా
X
మూడేళ్ల కిందట కూడా డేటా వినియోగం గురించి ఎవరైనా మాట్లాడితే.. అంత అవసరమా? అన్న భావన చాలామందిలో ఉండేది. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ.. వాయిస్ కాల్ కంటే కూడా ఫోన్ ఉన్నది డేటా వినియోగానికే అన్నట్లుగా మారిపోయిన పరిస్థితి.ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే.. ఫోన్ మాట్లాడే కన్నా.. ఇతర అవసరాలకే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. మారిన వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా టెలికం కంపెనీలు ‘డేటా’ను డిమాండ్ కు తగ్గట్లుగా సొమ్ము చేసుకోవటం మొదలెట్టాయి.

దీనికి చెక్ చెప్పినట్లే చెప్పి.. మొత్తంగా మార్కెట్ ను తన చేతుల్లోకి తీసుకోవాలన్న ఆలోచనతో తెర మీదకు వచ్చారు ముకేశ్ అంబానీ. తన జియోతో దేశంలో కొత్త సంచలనంగా మారిన ఆయన.. అతి తక్కువ ధరకే ఇంటర్నెట్.. ఫ్రీ వాయిస్ కాల్స్ తో సంచలనం సృష్టిస్తున్న ఆయన.. తాజాగా అదిరిపోయే ఆఫర్ ఒకటి తెర మీదకు తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ టెలికం సేవల మీద ఫోకస్ చేసిన ఆయన త్వరలో డీటీహెచ్ సేవల్ని అందించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తాజాగా ఇంటర్నెట్ సేవల్ని కారు చౌకగా ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ఒకటి బయటకు వచ్చింది. రిలయన్స్ జియో పేరిట రానున్న ఇంటర్నెట్ సేవల ధరలు చౌకగా ఉండటంతో పాటు.. రూ.500లకు 600జీబీ డేటాను ఇవ్వాలని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది.

చౌక ధరకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న నేపథ్యంలో వేగం మాటేమిటన్న సందేహం అక్కర్లేదని రిలయన్స్ వర్గాలు చెబుతున్నట్లుగా సమాచారం. 120 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీ స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందిస్తారని.. జియో గిగా ఫైబర్ స్పెషల్ ఆఫర్ ప్లాన్ తో ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన వివరాల్ని సదరు కంపెనీ ప్రకటించినట్లుగా ఒక ప్లాన్ బయటకువచచింది. దీని ప్రకారం మూడు నెలలు అపరిమిత ఇంటర్నెట్ సేవల్ని అందిస్తారని చెబుతోంది. త్వరలో పైలెట్ ప్రాజెక్టు కింద సెప్టెంబరులో ఇంటర్నెట్ సేవల్ని ఫూణెలో ప్రవేశ పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. మరీ ఆఫర్ తో కానీ జియో నెట్ సేవలు బయటకు వస్తే.. టెలికం కంపెనీల మధ్య డేటా వార్ మరింత ముదిరిపోతుందనటంలో సందేహం లేనట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/