Begin typing your search above and press return to search.

వాయిస్ కాల్స్ పై జియో షాకింగ్ న్యూస్‌?

By:  Tupaki Desk   |   2 Oct 2017 12:51 PM GMT
వాయిస్ కాల్స్ పై జియో షాకింగ్ న్యూస్‌?
X
గ‌త ఏడాది సెప్టెంబ‌రులో మార్కెట్లోకి విడుద‌లైన రిల‌య‌న్స్ జియో టెలికాం రంగాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. జీవిత‌కాలం ఫ్రీ కాల్స్, ఫ్రీ మొబైల్ డేటా అంటూ దూసుకువ‌చ్చిన‌ జియో దెబ్బ‌కు ఎయిర్ టెల్‌ - ఐడియా - వొడాఫోన్ వంటి టెలికాం కంపెనీలు విల‌విల‌లాడాయి. అన్ లిమిటెడ్ డేటాను క‌స్ట‌మ‌ర్లు దుర్వినియోగప‌రుస్తున్నార‌న్న కార‌ణంతో కొద్ది రోజుల నుంచి రోజుకు 1 జీబీ డేటాను మాత్ర‌మే అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇపుడు అదే త‌రహాలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పై కూడా ప‌రిమితులు విధించేందుకు జియో సిద్ధ‌మ‌వుతోంద‌ని టెలికాం వ‌ర్గాల్లో చర్చ న‌డుస్తోంది. ఇక‌పై రోజుకు కేవలం 300 నిమిషాలు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునేలా జియో నిబంధన విధించబోతున్నట్టు అన‌ధికారిక వార్తలు వ‌స్తున్నాయి. రోజుకు10 గంట‌ల క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఫోన్ మాట్లాడే వారికి ఈ నిబంధ‌న వ‌ర్తించ‌క‌పోవ‌చ్చ‌ని టెలికాం వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ప్రారంభంలో జియో 4జీ డేటాను కూడా అపరిమితంగానే ఆఫర్ చేసింది. అయితే కొంత‌మంది డేటాను దుర్వినియోగ‌ప‌రుస్తున్నార‌ని, ప్రస్తుతం రోజుకు ఒక జీబీ డేటాను అందిస్తోంది. అదే ప‌ద్ధ‌తిలో వాయిస్ కాల్స్ పై కూడా లిమిట్ విధించేందుకు జియో యోచిస్తోంది. అపరిమిత కాల్స్ ఫీచర్ ను కొంత‌మంది త‌మ వాణిజ్య‌ప్ర‌క‌ట‌న‌కు ఉప‌యోగిస్తున్నార‌ని టెలికాంటాక్ట్ జియో ప్రియారిటీ టీమ్ ప్ర‌తినిధి ఒక‌రు అన‌ధికారికంగా తెలిపారు. అంతేకాకుండా, కొంతమంది వినియోగదారులు రోజుకు 10 గంటలకు పైగా కాల్స్ మాట్లాడుతూ ఉచిత సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని చెప్పారు. దీంతో, జియో ఫ్రీ కాల్స్ ఉద్దేశం ప‌క్క‌దారిప‌డుతోంద‌ని రిల‌య‌న్స్ భావిస్తోంద‌ట‌. అయితే, ప్ర‌తిరోజు 10 గంట‌ల‌కు త‌క్కువ మాట్లాడే వినియోగ‌దారుల‌కు కూడా ఈ కొత్త ప‌రిమితులు వ‌ర్తిస్తాయా? అన్న ప్ర‌శ్న‌కు ఆ ప్ర‌తినిధి స‌మాధానమివ్వ‌లేదు. 10 గంట‌ల క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఫోన్ మాట్లాడే వారికి ఈ నిబంధ‌న వ‌ర్తించ‌క‌పోవ‌చ్చ‌ని టెలికాం వ‌ర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ కొత్త నిబంధ‌న‌పై రిల‌య‌న్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.