Begin typing your search above and press return to search.

రిలయన్స్ లాభం రూ.15,792 కోట్లు అని చెప్పినా షేరు ధర తగ్గిందెందుకు?

By:  Tupaki Desk   |   21 Jan 2023 7:30 AM GMT
రిలయన్స్ లాభం రూ.15,792 కోట్లు అని చెప్పినా షేరు ధర తగ్గిందెందుకు?
X
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికం లాభనష్టాల లెక్కల గురించిన వివరాల్నిసంస్థ అధిపతి ముకేశ్ అంబానీ వెల్లడించారు. సవాళ్లు ఎదురవుతున్న వేళలోనూ తమ వ్యాపారాలన్నీ బలంగా రాణించాయని.. జియో రికార్డు స్థాయి ఆదాయాలను అందించినట్లుగా పేర్కొన్నారు. 5జీ సేవల్ని ఆవిష్కరించటం.. 134 నగరాలకు విస్తరించటంతో పాటు.. రిటైల్ వ్యాపారం మెరుగ్గా ఉందని.. తమ బలమైన బ్యాలెన్స్ షీట్లు.. నగదు నిల్వలు.. ప్రస్తుత వ్యాపార వ్రద్ధికి.. కొత్త అవకాశాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని చెప్పిన ముకేశ్ అంబానీ.. లెక్కల విషయానికి వస్తే.. నికర లాభం తగ్గిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

రుణ వ్యయాలు పెరగటం.. తరుగుదల కారణంగా లాభం తగ్గినట్లుగా చెప్పిన అంబానీ..దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తూ.. అన్ని వ్యాపారాల్లో ఆస్తుల్ని విస్తరించటం కారణంగా తరుగుదల 32.6 శాతం పెరిగిందని.. డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై విధించిన పన్ను వల్ల.. లాభంపై రూ.1898 కోట్ల ప్రభావం కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా నికర లాభం 15 శాతం తగ్గినప్పటికీ ఆదాయాలు 15 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు.

మూడో త్రైమాసికంలో రూ.2,20,592 కోట్ల ఆదాయం మీద రూ.15,792 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లుగా పేర్కొన్నారు. అంటే.. ఒక్కో షేరుకు రూ.23.34 లాభం పొందినట్లైంది.

అయితే.. ఇదే లెక్కలు 2021-22 త్రైమాసికంలో మాత్రం రూ.18,549 కోట్ల నికర లాభాన్ని పొందటం గమనార్హం. అంటే.. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.28.08 చొప్పున లాభం వచ్చింది. జియో జిల్ జిల్ అంటున్నట్లు చెప్పారు. నికర లాభంలో 28.3 శాతం మెరుగుదల కనిపించిందని దీంతో లాభం సైతం భారీగా వచ్చినట్లుగా పేర్కొంటూ ఒక్క జియోలోనే రూ.4638 కోట్లు చేరుకున్నట్లు పేర్కొన్నారు. జియోలో వినియోగదారుల సంఖ్య 43.3 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.

రిలయన్స్ ఇ - కామర్స్ లోనూ లాభం భారీగా పెరిగినట్లుగా వెల్లడించారు. సోస్యో.. లోటస్ చాక్లెట్ కొనుగోళ్లతో పాటు ఇండిపెండెన్స్ బ్రాండ్ ఆవిష్కరణతో పోర్ట్ ఫోలియో మరింత బలోపేతం అయినట్లుగా రిలయన్స్ పేర్కొంది. తమ వ్యాపారాల విస్తరణలో భాగంగా రూ.20వేల కోట్ల నిధులను ఎన్ సీడీల ద్వారా సంస్థ సమీకరిస్తుందని చెప్పారు. ఇన్ని చెప్పినా.. ఫ్యూచర్ అంతా బాగుంటుందన్న మాట చెప్పినప్పటికీ.. నికర లాభంలో తగ్గుదల మాట.. తరుగుల పెరిగినట్లుగా వెల్లడైన విధానం రిలయన్స్ షేరు ధర మీద ప్రభావం చూపించింది.

త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన రోజున షేరు ధర ఒక్కొక్క దానిపై రూ.29.05 చొప్పున అంటే 1.18 శాతం తగ్గింది. దీంతో.. ఒక్కో షేరు ధర రూ.2443 వద్ద మార్కెట్ క్లోజ్ అయ్యింది. గడిచిన కొద్ది రోజులుగా రిలయన్స్ షేరు ధర కిందకు చూడటమే తప్పించి.. పైకి చూడని విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.