Begin typing your search above and press return to search.

అంబానీనా మజాకానా?

By:  Tupaki Desk   |   14 Aug 2019 5:49 AM GMT
అంబానీనా మజాకానా?
X
దేశంలో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు. కానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భిన్నం. ఆయన నోటి నుంచి మాట వస్తే దానికుండే ఆదరణ.. నమ్మకం ఎంతన్న విషయం తాజాగా మరోసారి రుజువైంది. రానున్న ఏడాదిన్నరలో తమ కంపెనీని పూర్తిగా రుణ విముక్తి చేస్తామని ప్రకటించి సంచలనంగా మారారు. దాదాపు లక్షన్నర కోట్లు ఉన్న రుణాన్ని తాము తీర్చేయనున్నట్లు చెప్పారు. దీంతో.. రిలయన్స్ షేరు పరుగులు తీసింది. అదెంతలా అంటే.. మార్కెట్ పతనం భారీగా సాగుతున్న వేళలోనూ షేరు ధర భారీగా దూసుకెళ్లింది.

మార్కెట్ మొత్తం బేర్ మంటున్న వేళ.. అందుకు భిన్నంగా రిలయన్స్ షేరు మాత్రం అత్యధిక లాభాన్ని మూటగట్టుకోవటం గమనార్హం. అంతేకాదు.. గడిచిన పదేళ్లలో ఒక్క రోజులో రిలయన్స్ షేర్ మార్కెట్ విలువ ఏకంగా రూ.72వేల కోట్లకు పెరగటం విశేషం. ఓపక్క సెన్సక్స్ 624 పాయింట్లు కుప్పకూలి.. అన్ని ప్రధాన షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్న వేళ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం భారీగా దూసుకెళ్లాయి. పది శాతం పెరుగుదలను నమోదు చేసింది.

తాజాగా నిర్వహించిన 42వ వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడిన ముకేశ్ అంబానీ..రానున్న 18 నెలల్లో కంపెనీకి అప్పు లేకుండా చేస్తానని చెప్పటంతో పాటు.. సెప్టెంబరు 5 నుంచి కంపెనీ భారీగా ఆశలు పెట్టుకున్న ఆప్టికల్ ఫైబర్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభం కానున్నాయి. వార్షిక చందాతో ఉచితంగా టీవీ.. ఏఆర్.. వీఆర్ లాంటి వినూత్న సాంకేతికతల్లోకి కంపెనీ అడుగుపెట్టనున్నట్లుగా చెప్పిన మాట మదుపరుల్లో విశ్వాసంతో పాటు.. ఉత్సాహాన్ని నింపింది. దీని ఫలితంగా షేరు ధర పరుగులు తీసింది. మార్కెట్ మొత్తం పడిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా ఉరకలెత్తే ఉత్సాహంతో షేరును పరుగులు తీయటం ముకేశ్ అంబానీకి మాత్రమే సాధ్యమని చెప్పాలి.