Begin typing your search above and press return to search.

ఏపీలో అంబానీ పెట్టుబ‌డి రూ.52వేలు కోట్లు?

By:  Tupaki Desk   |   26 Feb 2018 2:43 AM GMT
ఏపీలో అంబానీ పెట్టుబ‌డి రూ.52వేలు కోట్లు?
X
ఏడాదికి ఒక‌సారి సాగ‌ర‌తీర‌మైన విశాఖ న‌గ‌రంలో భాగ‌స్వామ్య స‌ద‌స్సును నిర్వ‌హిస్తుండ‌టం తెలిసిందే. ప్ర‌తి నెల‌కో.. రెండు నెల‌ల‌కోసారి స‌ద‌స్సుల పేరుతో కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌టం.. హడావుడి చేయ‌టం.. అంతా బాగా జ‌రుగుతుంద‌న్న భావ‌న‌తో పాటు.. కొత్త ఆశ‌ల్ని. .కొత్త క‌ల‌ల్ని క‌నేలా చేయ‌టం.. అందుకు త‌గ్గ‌ట్టే మాట్లాడ‌టం బాబుకు మామూలే. గ‌డిచిన మూడేళ్ల విష‌యాన్నే తీసుకుంటే.. ప్ర‌తి ఏటా ఆర్భాటంగా సీఐఐ స‌ద‌స్సు నిర్వ‌హించ‌టం.. ప్ర‌తి రోజు అన్ని వేల కోట్ల పెట్టుబ‌డుల‌కు సంత‌కాలు జ‌రిగాయి.. ఇన్నివేల కోట్ల రూపాయిల‌కు ఒప్పందాలు కుదిరాయ‌ని హ‌డావుడి చేసేది తెలిసిందే.

సుమారు లెక్క చూస్తే.. గ‌డిచిన మూడేళ్ల‌లో నాలుగైదు ల‌క్ష‌ల కోట్ల రూపాయిల పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒప్పందాలు ఏపీ స‌ర్కారుతో జ‌రిగిన‌ట్లుగా చెప్పాలి. క‌చ్ఛితంగా లెక్క‌లు తీస్తే మ‌రింత ఎక్కువ అయినా ఆశ్చ‌ర్యం లేదు. అలాంటప్పుడు.. పేప‌ర్ల‌లో కుదుర్చుకున్న ఒప్పందాల‌కు.. రియ‌ల్ గా ఏపీకి వ‌చ్చి ప‌నులు ప్రారంభించిన ప్రాజెక్టుల విలువ ఎంత‌న్నది లెక్క తీస్తే విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌ళ్లీ ఏపీ ముఖ్య‌మంత్రి సీఐఐ స‌ద‌స్సు పేరుతో విశాఖ‌లో హ‌డావుడి చేస్తున్నారు. ఒక్క రిల‌య‌న్స్ సంస్థ ఏపీలో రూ.52వేల కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు అంగీక‌రించింద‌ని వెల్ల‌డించారు. తాజాగా జ‌రిగిన భాగ‌స్వామ్య స‌ద‌స్సులో రిల‌య‌న్స్ ప్రెసిడెంట్ కిర‌ణ్ థామ‌స్‌.. ఏపీ ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శులు అజ‌య్ జైన్.. విజ‌యానంద్ లు సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో సంత‌కాలు చేసేశారు.

ఈ మ‌ధ్య‌నే అమ‌రావ‌తికి రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ రావ‌టం.. సీఎం చంద్ర‌బాబుతో భేటీ కావ‌టం.. ఆ సంద‌ర్భంగా వారి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌కు ఫ‌లితంగానే ఈ భారీ ఒప్పందం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు. ముకేశ్ అంబానీ లాంటి బ‌డా పారిశ్రామిక‌వేత్త ఏపీకి వ‌చ్చి అంతేసి పెట్టుబ‌డులు పెడుతున్నారంటే.. ఇందుకు ప్ర‌భుత్వం ఏమి ఇవ్వ‌నుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక‌.. రిల‌య‌న్స్ పెడ‌తాన‌ని చెబుతున్న పెట్టుబ‌డుల‌న్నీ చ‌మురు.. గ్యాస్.. ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని ఒప్పందాలు కుదిరాయి. మొత్తం రూ.52వేల కోట్ల‌లో రూ.37 వేలు ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో.. మ‌రో రూ.15వేల కోట్లు తిరుప‌తి వ‌ద్ద ఏర్పాటు చేసే ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల త‌యారీ సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా వ‌చ్చే పెట్టుబ‌డుల కార‌ణంగా ఏపీకి పాతికే వేల ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న ఆశాభావాన్ని బాబు చెబుతున్నారు.

జియో నేతృత్వంలో తిరుప‌తిలో సెట్ టాప్ బాక్సులు.. సెల్ ఫోన్ల త‌యారీ యూనిట్ల‌ను ప్రారంభిస్తార‌ని.. ఇందుకోసం 150 ఎక‌రాల్ని కేటాయించిన‌ట్లుగా చెప్పారు. ఇందులో ప్ర‌భుత్వం మాన‌వ వ‌న‌రుల్ని స‌మ‌కూర్చేందుకు ఐఐటీ లాంటి విద్యా సంస్థ‌ల్ని కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీ జెట్ స్పీడ్ తో వెళుతున్న‌ట్లు క‌నిపించ‌క మాన‌దు. అందులో నిజం ఎంతో కాస్త ఆగితే కాలం చెప్పాల్సింది చెప్పేస్తుంది.