Begin typing your search above and press return to search.

రిలయన్స్ ఔట్.. బాబు పెట్టుబడుల బాగోతం

By:  Tupaki Desk   |   3 Nov 2019 9:15 AM GMT
రిలయన్స్ ఔట్.. బాబు పెట్టుబడుల బాగోతం
X
చంద్రబాబు ప్రభుత్వంలో దేశవిదేశాల పారిశ్రామిక సంస్థలతో వందల ఎంవోయులు జరిగాయి. వందలాది పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయని బాబు గారు డబ్బా కొట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చాటింపు వేశారు. ఆయా పరిశ్రమలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. వందల ఎకరాలను ధారాదత్తం చేశారు. కానీ ఒక్క సంస్థ కూడా పరిశ్రమలు స్థాపించలేదు. ఆ భూములను అలాగే వదిలేశాయి. దీంతో ఉన్నది పోయింది.. రైతులు భూములు కోల్పోయిన చందంగా మారింది. చంద్రబాబుగారి హయాంలో ఏపీలో ఇదీ పరిశ్రమల తీరు అని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎండగడుతోంది...

తాజాగా దేశంలోనే అపర కుబేరుడు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్నారు.. తాజాగా ఆ రెండు ఒప్పందాల్లో ఒకటిని రద్దు చేసుకుంది. తిరుపతి సమీపంలో ఏకంగా 15వేల కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ ఆలోచనను రిలయన్స్ విరమించుకున్నట్టు తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం రిలయన్స్ కు కేటాయించిన తిరుపతిలోని 150 ఎకరాలను తిరిగి తీసుకునేందుకు వైసీపీ సర్కారు రెడీ అయ్యింది. ఇక కాకినాడలో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పరిశోధనను మాత్రం కొనసాగించేందుకు రిలయన్స్ సిద్దమైంది.

ఇప్పటికే రిలయన్స్ కు తిరుపతిలో కేటాయించిన 150 ఎకరాలపై 15మంది రైతులు కోర్టుకెక్కి స్టే తెచ్చారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రిలయన్స్ ను కోరి 75 ఎకరాలను అప్పగించింది. అయినా రిలయన్స్ నుంచి స్పందన లేదట.. రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటు నుంచి వైదొలగిందని.. ఎంత ప్రయత్నించినా వాళ్లు ఆసక్తి చూపించడం లేదని ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

దీంతో 15వేల కోట్ల విలువైన పరిశ్రమ ఏపీకి దక్కకుండా పోయింది. అటు ఉపాధి కరువై.. ఇటు భూమి కోల్పోయినట్టైంది. చంద్రబాబు హయాంలో ఇలాంటి చాలా ఒప్పందాలు చేసుకొని పరిశ్రమలు స్థాపించని పరిశ్రమలపై వైసీపీ సర్కారు ఇప్పుడు సీరియస్ గా స్పందిస్తోంది. పరిశ్రమల వారిని సంప్రదిస్తూ గట్టిగా అడుగుతుండడంతో చంద్రబాబు పెట్టుబడుల బాగోతం ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది.