Begin typing your search above and press return to search.

అంబానీ ఆఫర్ ను కేసీఆర్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   8 Dec 2016 4:37 AM GMT
అంబానీ ఆఫర్ ను కేసీఆర్ ఏం చేస్తారు?
X
మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా రాష్ట్రాన్ని దూసుకెళ్లేలా చేయటం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తన ముందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి ఆయన సిద్ధంగా ఉండరు. అలాంటి కేసీఆర్ కు రిలయన్స్ అంబానీ అదిరిపోయే ఆఫర్ ఒకటి ప్రతిపాదించారు. కేజీ నుంచి పీజీ వరకూ మొత్తం ఒకే క్యాంపస్ లో నిర్వహించేందుకు తాము సిద్ధమని.. తెలంగాణలో ఏర్పాటు చేసే ఈ భారీ విద్యా సంస్థకు అవసరమైన అనుమతులు ఇవ్వాల్సిందిగా రిలయన్స్ కోరుతోంది.

ఈ భారీ విద్యా సముదాయం కోసం రిలయన్స్ ఏకంగా రూ.10వేల కోట్లు పెట్టుబడిగా పెట్టటానికి సిద్ధంగా ఉంటామని చెప్పింది. అయితే.. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరటమే కాదు.. నిబంధనల్ని మార్చాలన్న మాటను చెప్పటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఈ మధ్యన ముంబయి వెళ్లినప్పుడు రిలయన్స్ నుంచి తాజా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

భారీ విద్యా సంస్థను ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ స్థాయిలో విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యాసంస్థలో రిజర్వేషన్లకు చెల్లుచీటి చెప్పేసి కేవలం.. మెరిట్ తో మాత్రమే ఆడ్మిషన్ ఇవ్వాలని భావిస్తోంది. సాధారణంగా స్కూళ్లు.. కాలేజీలు.. వర్సిటీ వేర్వేరుగా ఉంటాయి. కానీ.. రిలయన్స్ పెట్టాలని భావిస్తున్న భారీ విద్యాసంస్థలో ఇవన్నీ ఒక్కచోటే ఉండాలని భావిస్తోంది.

ఇందుకోసం తమకు వెయ్యి ఎకరాల స్థలాన్ని రాయితీ ధరతో అందించాలని రిలయన్స్ కోరుతోంది. అలా చేసిన పక్షంలో తాము అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రమాణాలతో విద్యాసంస్థల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతోంది. అయితే.. ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ ప్రయోజనాలు కానీ పొందితే అందుకు తగ్గట్లే రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది.

కానీ.. ఈ విషయంలో రిలయన్స్ మాత్రం ఒప్పుకోని పరిస్థితి. దీంతో.. విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఉన్న నిబంధనల్ని మార్చాల్సి ఉంటుంది. స్థల సేకరణతో పాటు.. మినహాయింపు.. రిజర్వేషన్ల అమలు లేకుండా కేవలం మెరిట్ తో మాత్రమే ప్రవేశాలు పొందేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్న విద్యా ప్రాంగణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేసే సత్తా ఉన్న ఈ విద్యా సంస్థ ఏర్పాటు ఎక్కడ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. విమానాశ్రయానికి దగ్గర్లోనే ఇలాంటి భారీ సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిన నేపథ్యంలో ఇదెక్కడ పెడతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.