Begin typing your search above and press return to search.

బీజేపీకి రివర్సు కొట్టిన మత రాజకీయం ?

By:  Tupaki Desk   |   16 April 2021 12:12 PM GMT
బీజేపీకి రివర్సు కొట్టిన మత రాజకీయం ?
X
ఏ దిక్కు లేకపోతే గోదారే దిక్కన్నట్లుగా తయారైంది బీజేపీ నేతల వ్యవహారం. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో తమకు ఓట్లేయమని అగడటానికి అక్కడ విషయం ఏమీ కనబడలేదు. పోనీ ప్రత్యర్ధులకు ఓట్లేయద్దని చెబుదామన్నా విషయం లేదు. అందుకనే చివరకు కమలనాదులు ఏమి చేశారంటే వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తిపై మతపరమైన బురద చల్లేందుకు తెగ ప్రయత్నించారు. చివరకు అదికూడా వర్కవుట్ కాకపోవటంతో ఆయాసం వచ్చి కూర్చుండిపోయారు.

మతపరమైన రాజకీయాలు చేయటంలో బీజేపీ ఏ స్ధాయికి దిగజారిపోతుందో అందరికీ తెలిసిందే. అందుకని అలావటైన మతరాజకీయాలకు తెరదీసింది. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన గురుమూర్తికి పోటీచేసే అర్హత లేదని కొద్దిరోజులు గోలపెట్టారు. దాన్నెవరు పట్టించుకోలేదని అర్ధమైపోయింది. అందుకనే ఆ విషయాన్ని వదిలేసి గురుమూర్తి ఎస్సీ కాదంటూ రచ్చ మొదలుపెట్టారు. ఆ రచ్చకూడా వర్కవుట్ కాలేదు.

చివరకు వైసీపీ అభ్యర్ధి క్రిస్తియన్ కాబట్టి పవిత్రమైన హిందుదేవాలయం ఉండే తిరుపతి ఎంపిగా పోటీచేయటానికి అర్హుడుకాడంటూ గోల మొదలుపెట్టారు. చివరకు దాన్నికూడా జనాలు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని గురుమూర్తి చర్చికి వెళ్ళి ఫాదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నప్పటి ఫొటోను ఒకదాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి గోల మొదలుపెట్టారు.

ఎన్నికల్లో పోటీచేసే వారు లేకపోతే పార్టీల అధినేతల సర్వమత ప్రార్ధనల్లో భాగంగా చర్చీలు, మసీదులు, దేవాలయాలకు వెళ్ళటం మామూలే. ఇందులో భాగంగా గురుమూర్తి కూడా చర్చికి వెళ్ళారు. కాబట్టి ఈ ఫొటోలను కూడా జనాలు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచనిస్ధితిలో పడిపోయారు కమలనాదులు. సరే ఇంతలో ఎన్నికల ప్రచారం కూడా అయిపోయింది.

ఇపుడు కమలనాదుల సమస్యేమిటంటే అసలు బీజేపీకి డిపాజిట్ వస్తుందా లేదా ? అన్నదే. మొన్నిటి ఎన్నికల్లో ఎంతో కష్టపడితే వచ్చిన ఓట్లు 16500. మరిపుడు ఎంతొస్తుందో ఏమో ? చూడాల్సిందే. మొత్తంమీద అనవసరమైన విషయాన్ని టచ్ చేసి బీజేపీ నేతలు తమ సమయాన్ని వృధా చేసుకోవటమే కాకుండా పరువు కూడా పోగొట్టుకున్నారు.